గోదావరిఖని, ఆగస్టు 30 : ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా సింగరేణి వార్షిక పద్దు లెక్క తేలడం లేదు. నేటికీ లాభాల వాటాను ప్రకటించలేదు. 2024 జూన్‌లో మరో త్రైమాసిక లెక్కలు ముగిసినా గత ఆర్థిక సంవత్సరం లెక్కలకు సంబంధించి ప్రకటన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. దేశంలో 85 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోలిండియా సంస్థ, గత ఆర్థిక సంవత్సరంలో 1,42,324 కోట్ల వ్యాపారంతో 37,369 కోట్ల లాభాలు సాధించినట్టు మే 2న ప్రకటించింది.
దీనికి తోడు ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 36,464 కోట్ల వ్యాపారం చేసి 10,858 కోట్ల లాభాలు సాధించినట్లు గత నెల 31న వెల్లడించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగం లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న ఎన్టీపీసీ గత ఆర్థిక సంవత్సరం 1,78,501 కోట్ల వ్యాపారంతో 21,332 కోట్ల లాభాన్ని సాధించినట్టు మే 24న ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 48,521 కోట్ల వ్యాపారంతో 5,506 కోట్ల లాభాలు సాధించినట్టు గత నెల 27న వెల్లడించింది. ప్రభుత్వ రంగంలో ఉన్న కోల్ ఇండియా, ఎన్టీపీసీ సంస్థలు ఎంతో పారదర్శకంగా ఎప్పటికప్పుడు తమ వ్యాపార లాభాలను ప్రకటిస్తుంటే.. సింగరేణి మాత్రం తీవ్ర జాప్యం చేస్తుండడం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది.
సింగరేణిలో సంస్థ ప్రకటించిన లాభాల మేరకు కార్మికులకు వాటా చెల్లించే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలో సంస్థ ఎప్పుడు లాభాలు ప్రకటిస్తుందోనని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 37 వేల కోట్ల వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తున్నా.. ఐదు నెలలైనా లెక్క ఎందుకు తేలడం లేదనేది అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ వ్యాపార లాభాలను ప్రకటిస్తుంటే సింగరేణి మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రకటిస్తున్నది.
అయితే, లాభాల్లో వివిధ రకాల మొత్తాలను పక్కకు పెట్టడం కారణంగానే ప్రకటనలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు దాటగా, లాభాలు రూ.మూడు వేల కోట్లకు పైగానే వస్తాయని అంచనా ఉండడంతో కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో లాభాలపై 32 శాతం వాటాను ప్రకటించగా, ఈసారి వెంటనే లాభాలను ప్రకటించి 35 శాతం వాటా చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.