Chigurumamidi | చిగురుమామిడి, మే 17 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా కొనుగోలు జరగకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యం కుప్పలతో నిరీక్షించాల్సి వస్తుంది. 15 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు, రామంచ, గాగిరెడ్డిపల్లి, గునుకులపల్లి, ఇందుర్తి, సుందరగిరి, బొమ్మనపల్లి, రేకొండ తదితర గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోసి ఎదురుచూస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద కొందరు నిర్వాహకులు హమాలీలతో కుమ్మక్కై వారికి అనుకూలమైన రైతులకు ధాన్యం కోనుగోలు చేయడం జరుగుతుందని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ జిల్లా స్థాయి అధికారులను మచ్చిక చేసుకున్నాడని ఆరోపణలు వినబడుతున్నాయి.