ఇటీవలి కాలంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం కలవరపెడుతున్నది. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఏటా 35 వేల మంది రోగులు చికిత్స పొందుతుండడం, అందులో చాలా మందికి పూర్తి స్థాయిలో వైద్యం అందక మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
వైద్య చికిత్స కోసం ఖర్చు భరించే స్థోమత లేకపోవడం.. ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం నిరుపేద రోగుల ప్రాణాల మీదకు వస్తున్నది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు అనివార్య మవుతున్నది. అందుకు అనుగుణంగానే సర్కారు వైద్యులు ఇటీవల ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం వెంటనే స్పందించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
Cancer Patients | కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్యం ఏటా పెరుగుతున్నది. ప్రభుత్వ ప్రధాన దవాఖానతోపాటు వివిధ ప్రైవేట్ వైద్యశాలల్లో ఏటా చికిత్స పొందుతున్న రోగులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. మూడేళ్లలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2022 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మూడు ప్రైవేట్ క్యాన్సర్ దవాఖానల్లో 96వేల మందికి పైగా చికిత్స పొందినట్టు తెలుస్తున్నది. చల్మెడ ఆనందరావు క్యాన్సర్ దవాఖానలోనే అత్యధికంగా రోగులు చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఒమేగా, ప్రతిమ హాస్పిటళ్లలో రోగులు ఉన్నారు.
మూడేళ్లలో చల్మెడలో 76,759 మంది, ఒమేగాలో 11,152 మంది, ప్రతిమలో 8,822 మంది చికిత్స పొందినట్టు తెలుస్తున్నది. ఇక ప్రభుత్వ దవాఖానలో చూస్తే 2022లో 139 మంది, 2023లో 142 మంది, 2024లో ఇప్పటి వరకు 140 మంది చొప్పున మొత్తం 421 మంది చికిత్స పొందినట్టు తెలుస్తున్నది. అంటే, వ్యాధి ఎంతలా విస్తరిస్తున్నదో ఈ నివేదికలను బట్టి అర్థమవుతుంది. క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న క్రమంలో స్థానికంగా ప్రభుత్వ వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేక నిరుపేద రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటే ఆర్థిక భారం తప్పడం లేదు. క్యాన్సర్ సోకిన నిరుపేదలైతే చికిత్స చేయించుకునే స్థోమత లేక, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానలకు వెళ్లలేక మృత్యువాత పడుతున్నారు. చికిత్స పొందుతున్న రోగుల్లో ఏటా 2 నుంచి 3 శాతానికి మించి మరణాలు సంభవిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ మునుపటిలా ప్రాణాంతకం కాదు. మొదటి దశలో గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే నయమయ్యే అవకాశమున్నది. వైద్య విధానంలో అభివృద్ధి చెందిన అనేక అంశాలు ఇప్పుడు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ రోగులెందరో సకాలంలో గుర్తించబడి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన అనేక మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి.
ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మహిళల్లో ఉన్న రుగ్మతలను గుర్తించి ప్రభుత్వ వైద్యులకు సిఫారసు చేస్తున్నారు. అయితే, వారికి ఇక్కడి ప్రభుత్వ దవాఖానలో పూర్తి స్థాయిలో వైద్యం అందించే పరిస్థితి లేక వరంగల్, హైదరాబాద్ దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. చాలా మంది అక్కడికి వెళ్లలేక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు సరైన చికిత్స అందిస్తేనే రోగులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది.
అందుకు తగిన వైద్య సహాయం ప్రభుత్వ పరంగా లేకపోవడం, ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక పోవడంతో మహిళలు చాలా మంది క్యాన్సర్ వ్యాధిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఒరాల్ క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పురుషుల్లోనూ స్కిన్, బోన్, గొంతు, స్టమక్, పెద్దపేగు వంటి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మహిళల్లోనూ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధికి ఇక్కడే చికిత్స అందుబాటులో ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేంద్ర బిందువైన కరీంనగర్లో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయాలనేది చాలా కాలంగా వస్తున్న డిమాండ్. ఇప్పటికే ఇక్కడ జీజీహెచ్‌లో పాలియేటివ్ కేర్ సెంటర్ ఉంది. ఇక్కడ చికిత్స పొందేందుకు చివరి స్టేజీలో ఉన్న రోగులు వస్తున్నారు. ఇక్కడ వీరికి పూర్తి స్థాయిలో వైద్యం అందించే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని కొందరికి ఉన్నంతలో చికిత్స అందిస్తూ ఆయుషు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్స అందించేందుకు వైద్య విధానంలో పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ముఖ్యంగా క్యాన్సర్‌ను ఉన్న స్టేజీలోనే ఉంచే విధంగా పాటి కీమోథెరపీ, నయం చేసేందుకు ఇమ్యూనోథెరపీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రైవేట్ దవాఖానల్లో లభిస్తున్నాయి. కానీ, ఖర్చుతో కూడుకున్నదైనందున పేదలు అక్కడికి వెళ్లలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేస్తే నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను పరిశీలించి తక్షణమే ఇక్కడ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
క్యాన్సర్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి కూడా ప్రతిపాదించాం. జిల్లా కేంద్రంలో ఈ సదుపాయం ఉంటే ఎందరో పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది. మా ప్రతిపాదన మేరకు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అనుకుంటున్నాం. క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందిస్తే నిరుపేద రోగులపై ఆర్థిక భారం పడుకుండా ఉంటుందని ప్రభుత్వానికి నివేదించాం.
– డాక్టర్ గుండా వీరారెడ్డి, జీజీహెచ్ కరీంనగర్ సూపరింటెండెంట్