ఇతని పేరు మహ్మద్ మసూద్ ఖాన్. కరీంనగర్‌లోని రేకుర్తికి చెందిన మసూద్‌కు 20 రోజుల కింద జ్వరం వచ్చి ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లాడు. ఈ టెస్టూ.. ఆ టెస్టని చెప్పి రూ.5 వేల బిల్లు వేశారు. తర్వాత డాక్టర్ రాసిన మందులకు మరో రూ.2 వేలు ఖర్చయ్యాయి. ఇంటికి వెళ్లిన మసూద్‌కు జ్వరం తగ్గలేదు. మరో ప్రైవేట్ దవాఖానకు వెళ్లగా మూడు రోజుల కింద చేసిన టెస్టులే మరోసారి చేశారు. ఎప్పటిలాగే డాక్టర్ రాసిన మందులు తెచ్చుకుని ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా, జ్వరం తగ్గ లేదు. కుటుంబ సభ్యుల బలవంతంపై మరో వైద్యుడి దగ్గరకు వెళ్లిన మసూద్‌కు మొదటి రెండు దవాఖానల్లో జరిగిన అనుభవమే ఎదురైంది. చివరికి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి అడ్మిట్ కావల్సిన పరిస్థితి వచ్చింది. మూడు రోజుల తర్వాత కోలుకున్న మసూద్‌ఖాన్ వంటి వాళ్లెందరో ప్రైవేట్‌కు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. చిన్న జ్వరానికే అడ్డగోలు టెస్టులు చేయించి మామూలు జ్వరమని నిర్ధారించుకోవడం వైద్యులకు పరిపాటిగా మారింది.
కరీంనగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి రోజూ 2 వేల నుంచి 2,500 మంది జ్వరాలతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే జ్వర పీడితుల సంఖ్య 200 నుంచి 250 వరకే ఉంటోంది. మిగతా వాళ్లంతా ప్రైవేట్‌ను నమ్ముకొని వెళ్తే జేబులు ఖాళీ అవుతున్నాయి. జ్వరంతో బాధపడుతూ ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్లినా రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
నిజానికి జ్వరంతో బాధపడే రోగులకు మూడు రోజుల తర్వాత టెస్టు చేస్తే గానీ అది ఏ జ్వరమో బయటికి రాదు. అది కూడా సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) వంటి సాధారణ టెస్టు చేస్తే సరిపోతుంది. దీంతో పలు రకాల కంప్లేంట్స్ బయటపడే అవకాశాలుంటాయి. కానీ, కరీంనగర్లో జ్వరంతో బాధపడుతూ వచ్చిన ప్రతి ఒక్కరికీ చాలా మంది ప్రైవేట్ వైద్యులు రకరకాల టెస్టులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
టైఫాయిడ్, మలేరియా టెస్టులే కాకుండా లివర్ ఫంక్షన్ పేరిట ఎల్ఎఫ్టీ, కిడ్నీ ఫంక్షన్ పేరిట ఆర్ఎఫ్టీ వంటి వైద్య పరీక్షలు అదనంగా చేయిస్తున్నారు. ఇందులో ఏమీ తేలకుంటే చివరికి విటమిన్ పరీక్షలు కూడా చేయిస్తున్నారు. మామూలు జ్వరంతో వస్తే ఇన్ని టెస్టులేమిట్రా దేవుడా? అని రోగులు లబోదిబోమంటున్నారు. వైద్యులందరూ కూడబలుక్కున్నట్లు రోగులు ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్లినా ఇవే అనుభవాలు ఎదురవుతున్నాయి.
జ్వరం హై టెంపరేచర్లో ఉండి దవాఖానలో చేరితే చాలు.. ఐసీయూలోకి మార్చేస్తున్నారు. జ్వర పీడితులకు అక్కడ చేసే ప్రత్యేక చికిత్సంటూ ఏమీ ఉండదు. జ్వరం తగ్గడానికి యాంటీబయాటిక్, బలం కోసం ఫ్లూయిడ్స్, విటమిన్ మెడిసిన్ ఇస్తారు. దీనికి ప్రైవేటు దవాఖానల్లో డాక్టర్, నర్సింగ్, క్లీనింగ్ చార్జీలు వేసి రోజుకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ దవాఖానల్లో అయితే ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.50 వేలు వసూలు చేసే దవాఖానలు కూడా కరీంనగర్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఎక్కువ రోజులుంటే అంత వస్తాయని భావించే కొన్ని ప్రైవేట్ దవాఖానలు జ్వర పీడితులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. మరోవైపు వైద్యులకు కమీషన్లు ఇచ్చే డయాగ్నోస్టిక్ సెంటర్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి.
ప్రైవేట్ దవాఖానల్లో అందించే సేవలకు దేనికి ఎంత చార్జి చేస్తారనేది సూచిస్తూ ధరల పట్టికలు ప్రదర్శించాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలున్నాయి. కానీ, అనేక దవాఖానల్లో ఈ బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకుని ప్రతి ప్రైవేట్ దవాఖానలో ధర బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తే తప్ప ఈ దోపిడీకి అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు.
జ్వరం వచ్చినపుడు సహజంగా తెల్ల రక్త కణాలు తగ్గుతుంటాయి. జ్వరం తగ్గిన తర్వాత మళ్లీ పెరుగుతాయి. కానీ, కొందరు వైద్యులు డెంగీ లక్షణాలున్నాయని జ్వర పీడితులను బయపెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద ప్రైవేట్ దవాఖాన అయినా డెంగీ నిర్ధారించడానికి లేదు. కానీ, కరీంనగర్‌లోని కొన్ని ప్రైవేట్ దవాఖానలు మాత్రం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగీ లక్షణాలున్నట్లు జ్వర పీడితులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మాత్రం నిబంధనల ప్రకారం ర్యాపిడ్ టెస్టులో డెంగీ లక్షణాలు ఉంటే ఆ రక్త నమూనాలను ప్రభుత్వ దవాఖానకు పంపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు డెంగీ జిల్లాలో అంత విస్తృతం కాలేదని చెబుతుంటే, ప్రైవేట్ వైద్యులు మాత్రం రక్త కణాలు తగ్గితే చాలు డెంగీ పేరు చెప్పి జ్వర పీడితులను భయానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
జ్వరంతో బాధ పడే ప్రతి ఒక్కరికీ ఒళ్లు నొప్పులు ఉండడం సహజం. ఇంత మాత్రానికే కొందరు చికెన్ గున్యా టెస్టులు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడే వారిలో కొందరికి కడుపు నొప్పి కూడా ఉంటుంది. దీనికి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు తప్పని సరిగా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక రోగికి ఎన్ని టెస్టులు చేయించాలో అన్ని చేయించుకుంటే గానీ కొందరు వైద్యులు మందులు రాయడం లేదు. ఈ టెస్టులన్నీ చేయాలంటే ఎంత లేదన్నా రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అవుతుందని జ్వర పీడితులు వాపోతున్నారు. తీరా అన్నీ నార్మలే ఉన్నాయని, సాధారణ జ్వరానికి రూ.2 వేల వరకు మందులు రాస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.