కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 16 : కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటనకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానలను బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 6 నుంచి 24 గంటలపాటు ఓపీ వైద్యసేవలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాంకిరణ్, డాక్టర్ వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉదయం 10గంటలకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందిస్తామని తెలిపారు. తాము చేస్తున్న శాంతియుత బంద్కు ప్రజలు, పేషెంట్స్ సహకరించాలని కోరారు. కరీంనగర్ ఐఎంఏ శాఖ చేపట్టనున్న ధర్నాకు మెడికల్ రిప్లు మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజంటేటివ్స్ కరీంనగర్ శాఖ కార్యదర్శి అంజయ్య మిరుపాల తెలిపారు.
విద్యానగర్, ఆగస్టు 16 : కోల్కత్తాలో వైద్య విద్యార్థిపై జరిగిన అమాను ఘటనపై వైద్యులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.