ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలకవర్గాల గడువు వచ్చే నెల 15తో ముగియనుండగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక యంత్రాంగం సైతం ముందుకెళ్లడం లేదు. దీంతో ఎన్నికల సమరం సాగదన్న సంకేతాలే వెలువడుతుండగా.. ఆశావహుల్లో మాత్రం ఆసక్తి నెలకొన్నది.
కాగా, ప్రభుత్వం పాలకవర్గాల గడువు మరో ఆరు నెలలు పొడిగిస్తుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తుండగా.. ఇక్కడ మరో విషయంపై జోరుగా చర్చ నడుస్తున్నది. పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత ఆయా పోస్టులను నామినేటెడ్ ద్వారా భర్తీ చేసేందుకు కూడా సర్కారు ఆలోచనలు చేస్తున్నదన్న ప్రచారం సాగుతున్నది. అయితే, నామినేటెడ్ అనేది పీఏసీఎస్‌లకు వర్తిస్తుందా.. లేదా.. ? అన్న అంశంపై అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా.. ఈ విషయంపై అధికారుల నుంచి గానీ, ప్రజాప్రతినిధుల నుంచి గానీ పూర్తి స్థాయి క్లారిటీ కరువైంది.
కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు 2020లో జరిగాయి. పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 15తో ముగియనున్నది. ఇంకా 29 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. నిబంధనల ప్రకారం చూస్తే పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలి. ఆయా సంఘాలకు డైరెక్టర్లు, చైర్మన్లను ఎన్నుకోవాలి. ఎటువంటి అడ్డంకులూ లేకుండా ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ కనీసం నెల రోజుల ముందుగానే నోటిఫికేషన్ రావాలి. గతంలో జరిగిన ఎన్నికలను బట్టి చూస్తే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కావాలి.
ఆమేరకు ఓటర్ జాబితా ప్రకటించాలి. గ్రామ పంచాయతీల్లో అతికించాలి. అందులో ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిష్కరించి తుది జాబితా సైతం వెల్లడించాలి. ఈ ప్రక్రియ నడుస్తుండగానే అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనుండగా, బ్యాలెట్ బాక్సుల సేకరణతోపాటు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు రెడీ చేయాలి. నిబంధనల ప్రకారం ఎన్నికల నాటికి రుణం తీసుకున్న రైతులకు ఏడాది పూర్తయితేనే ఓటు హక్కు లభించనుండగా.. ఈ లెక్కను కూడా గుర్తించాలి. అయితే, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లా సహకార రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. కానీ, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ రాలేదు. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఇప్పట్లో సహకార సమరం జరిగేలా కనిపించడం లేదు.
సహకార ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈ పరిస్థితులను చూస్తే ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న విషయం మాత్రం స్పష్టమవుతున్నది. నిజానికి ఇప్పటికే పదవీ కాలం ముగిసిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ విషయంలో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్నది. అందులో భాగంగానే బీసీ జనాభా లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం ఇటీవలే సర్వే చేపట్టింది.
ఆ సర్వే సమగ్ర వివరాలు వచ్చాయని చెబుతున్నది. అదే నిజమైతే ముందుగా పంచాయతీ ఎన్నికలుండే అవకాశమున్నది. ఇప్పటికే జీపీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వం పలుసార్లు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సహకార ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తున్నది.
అలాగే, తమ పాలకవర్గాల గడువు మరో ఆరునెలల పాటు పొడిగించాలని ఇప్పటికే పలువురు పీఏసీఎస్ చైర్మన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడం కారణంగా పదవీ కాలం పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించి ఒక ఫైల్ కూడా మూమెంట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, నాలుగైదు రోజుల్లో దీనిపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. పదవీ కాలం పొడిగించకుండా.. పాలకవర్గాల సమయం పూర్తయిన తర్వాత కొంత సమయం తీసుకొని.. డైరెక్టర్లు, చైర్మన్ల పోస్టులను నామినేట్ ద్వారా భర్తీ చేసే ఆలోచన సైతం ప్రభుత్వం వద్ద ఉందనే ప్రచారం కూడా సాగుతున్నది. అయితే, పీఏసీఎస్‌ల విషయంలో నామినేట్ చేయవచ్చా.. లేదా..? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. దీనిపై అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు మాత్రం ఎవరికి వారే తమ వ్యూహ రచన అమలు చేస్తున్నారు. సహకార సంఘాల పరిధిలో ఉన్న ఓటర్ల వద్దకు వెళ్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆయా జిల్లాల్లో ఉన్న పీఏసీఎస్‌లు, ప్రతిపాదిత పీఏసీఎస్‌లు, మొత్తం సంఖ్య వివరాలు.. దీంతోపాటు సిద్దిపేట, భూపాల్పల్లి, హనుమకొండ జిల్లాల్లో ఉన్న పాతవి, కొత్తగా ప్రతిపాదించిన పీఏసీఎస్‌ల వివరాలు