‘వానకాలం సీజన్ ముగిసింది.. యాసంగి మొదలైంది. వరిలో ఏ రకం వేద్దాం.. అని ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు నారుపోయాలి..? జాగ్రతలేం పాటించాలి..? అని చింతిస్తున్నారా..? ఏ మాత్రం వద్దు.. మీ కోసం కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్, హుజూరాబాద్ వ్యవసాయ అధికారి సునీల్ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. యాజమాన్య పద్ధతులతోపాటు ఎలా ముందుకు‘సాగా’లో వివరిస్తున్నారు..
కాల్వశ్రీరాంపూర్/ హుజూరాబాద్, డిసెంబర్ 11: యాసంగిలో రైతులు ఎక్కువగా దొడ్డు రకం వరి వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలైన (120-130 రోజుల పంట కాలం) కూనారం సన్నాలు( కేఎన్ఎం-118), జగిత్యాల రైస్-1( జేజీఎల్-24423), తెలంగాణ సోనా( ఆర్ఎన్ఆర్ 15048), సన్నరకాలైన కూనారం వరి-2( కేఎన్ఎం -1638) వంటి రకాలు వేసుకోవాలి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 మధ్యలో నారు పోసుకుంటే మేలు. అలాగే, చలి ఉధృతిని బట్టి పంట కాలం 10 నుంచి 15 రోజులకు పెరిగే అవకాశముంటుంది. ఈ క్రమంలో చలి ప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా వానాకాలం పంట కోతలైన వెంటనే రైతులు యాసంగి పంటకు దుక్కులు సిద్ధం చేసుకొని త్వరగా నారు అలికి నాట్లు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని కూనారం పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్, హుజూరాబాద్ వ్యవసాయ అధికారి సునీల్ చెబుతున్నారు.
చలి నుంచి జాగ్రత్తలు..
రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండి, నారు ఎర్రబడుతుంది. దీనిని అధిగమించేందుకు నారుమళ్లపై కర్రలతో ఊతం ఇచ్చి పాలిథీన్ షీట్ లేదా, టార్పాలిన్లు లేదా ప్లాస్టిక్ సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడిలో రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి, తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. యాసంగిలో కాండం తొలుచుపురుగు ఉధృతి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు తీసేందుకు వారం ముందు 2 గుంటల నారుమడికి కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 800 గ్రాములు వేయాలి. ఇలా చేసే నారు త్వరగా ఆరోగ్యంగా పెరిగి 25-30 రోజుల్లో మూడు ఆకులతో నాటు వేసే దశకు వస్తుంది.
నారుమడి యాజమాన్యం
యాసంగిలో నారుమడికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మడిని 10-12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్ల కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు, లేదంటే వర్మీ కంపోస్టు వేసి కలియ దున్నుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల చలి వాతావరణంలో నారు ఎదుగుదల బాగా ఉంటుంది. రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని, (1 కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు), 2 కిలోల భాస్వరం, కిలో పొటాష్ వేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు