భోపాల్, నవంబర్ 8: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలోని దిగజారుడుతనం సామాజిక మాధ్యమంలో విస్తృతంగా వైరల్ అవుతున్నది. సాధారణంగా విద్యార్థులకు ఆహారాన్ని ప్లేట్లలో వడ్డిస్తుంటారు. కానీ షియోపూర్ జిల్లా హుల్పూర్ గ్రామంలో చిత్తు కాగితాలలో విద్యార్థులకు భోజనం వడ్డించడం ఈ పథకం డొల్లతనాన్ని బయటపెట్టింది. నేలపై చిన్న చిన్న చిత్తు కాగితాలలో చిన్నారులు ఆహారాన్ని భుజిస్తున్న దృశ్యం అందరి మనసులను కలచివేస్తున్నది. పైన ఎలాంటి కప్పు లేకుండా ఉన్న స్కూల్ కాంపౌండ్‌లో కటిక నేలపై కూర్చుని ఉన్న చిన్నారులు మురికిగా ఉన్న ఆ నేలపైనే తమకిచ్చిన చిత్తు కాగితాల్లో వడ్డించిన ఆహారాన్ని తిన్నారు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌తో విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ విషయం విచారణలో నిర్ధారణ కావడంతో దానికి బాధ్యులను చేస్తూ స్వయం సహాయక సంఘాన్ని తొలగించారు. అలాగే స్కూల్ ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తున్నది.