Narsingapur | వీణవంక, నవంబర్ 8: వరిధాన్యాన్ని కాంటాలు వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ రైతులు పది రోజులుగా రోడ్డుపై వరిధాన్నాన్ని ఆరబోస్తున్నారు. కాంటాలు వేయాలంటూ స్థానిక హమాలీలకు రైతులు తెలుపగా గతంలో కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వారం రోజులుగా కాంటాలు వేయకుండా కాలయాపన చేశారని స్థానిక రైతులు మండిపడ్డారు.
దీంతో బీహార్‌కు చెందిన కూలీలతో శుక్రవారం కాంటాలు ప్రారంభించగా స్థానిక హమాలీలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాంటాలు ఆపాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లి వరిధాన్యం కాంటాలు ఆపారు. దీంతో ఆగ్రహించిన రైతులు జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారిపై వరిధాన్యం బస్తాలు పెట్టి సుమారు గంటపాటు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. కొద్దిసేపు పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఆవుల తిరుపతి రైతులతో మాట్లాడి మీకు నచ్చిన వారితో కాంటాలు వేసుకోవచ్చని తెలుపగా రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. దీనిపై ఎస్సై ఆవుల తిరుపతిని వివరణ కోరగా నర్సింగాపూర్ హమాలీలు ఫిర్యాదు ఇవ్వగా కాంటాలు కాకుండా ఆపింది నిజమేనని తెలిపారు. ధర్నా వద్దకు వెళ్ళి రైతుల సమస్యను తెల్సుకొని వారికి నచ్చిన వారితో వరిధాన్యం కాంటాలు వేసుకోవచ్చని తెలిపినట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులు, హమాలీలు మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్లు వివరించారు.