న్యూఢిల్లీ, నవంబర్ 8: వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ఈ పండుగ సీజన్లో మునుపెన్నడు లేనంతగా 52 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 42 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయయని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ఫాడా తాజాగా వెల్లడించింది. వీటిలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది.
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోపాటు ఆదాయ పన్నులో సంస్కరణలు తీసుకురావడంతో వాహన అమ్మకాలు భారీగా పుంజుకోవడానికి దోహదం చేశాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ఈసారి పండుగ సీజన్లో 52,38,401 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 43,25,632 యూనిట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సాధించింది. వీటిలో 7,66,918 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, అలాగే 40,52,503 యూనిట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం, నిధుల లభ్యత అధికంగా ఉండటం, జీఎస్టీతో వాహన ధరలు దిగిరానుండటం అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమని విఘ్నేశ్వర్ అన్నారు.