Bandi Sanjay | కోల్ సిటీ, నవంబర్ 8: తానొకటి తలిస్తే… దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్రజల్లో గుళ్ల కూల్చివేత చర్యలతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చిలికి చిలికి గాలివానగా మారి రాష్ట్ర వ్యాప్త పరిణామంగా మారుతోంది. హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాలు ఐక్యవేదికగా ఉద్యమ కార్యచరణకు నడుం బిగించడంతో ఈ కూల్చివేతల వివాదం మరింత ముదురుతోంది.
ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని రామగుండం మున్సిపల్ అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. అటు చూస్తే ఐక్యవేదిక ప్రతినిధులు తగ్గేదెలే అన్నట్టుగా నిరసనలు కొనసాగిస్తుండటంతో సమస్య మరింత జఠిలమవుతోంది. కేంద్ర సహాయ మంత్రి జోక్యం చేసుకొని కూల్చివేతల వ్యవహారంపై శనివారం ఆరా తీయడమే గాకుండా స్వయంగా అధికారులకు ఫోన్ చేసి 48 గంటల డెడ్లైన్ విధించడంతో వివాదం ఎటు మలుపు తిరుగుతుందోనన్న గంధరగోళ పరిస్థితి నెలకొంది.
కూల్చివేతలు స్వయంకృపరాదమా..? మరెవరైనా ఆదేశిస్తే కూల్చివేయాల్సి వచ్చిందా..? అన్న విషయంలో మున్సిపల్ అధికారులు బయటపడటం లేదు. కాగా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాత్రం నిరసనలు ఆగడం లేదు. రెండో రోజు శనివారం నగరంలో దారి మైసమ్మ గుళ్లు కూల్చిన ప్రాంతాలలో స్థానిక బస్తీ వాసులతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆదివారం అదే ప్రాంతాలలో సంప్రోక్షణ పూజలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు ఒకవైపు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రకటనలు చేయడం స్థానిక ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది.
అదే మైసమ్మ గుళ్లో ప్రమాణం చేస్తారా : ఐక్య వేదిక నాయకుల సూటి ప్రశ్న
నగరంలో 46 దారి మైసమ్మ గుళ్ల కూల్చివేత లతో తమకు సంబంధం లేదని ప్రెస్ మీట్ లు పెట్టి నాలుగు గోడల మధ్య చెబుతున్న వారు అదే మాట మైసమ్మ గుడిలోకి వచ్చి ప్రమాణం చేస్తారా..? అని ఐక్య వేదిక నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేశ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల ప్రమేయం లేనిదే మున్సిపల్ అధికారులు అంతటి సాహసపేతమైన నిర్ణయం తీసుకుంటారా.. అని మండిపడుతున్నారు. మైసమ్మ గుళ్లు కూల్చి వేయించడమే కాకుండా తమకేమీ తెలియదని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అదే నిజమైతే సీసీ ఫుటేజ్ లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోచమ్మ మైదానం కూల్చివేస్తే ఎవరు అడ్డు చెప్పలేదన్న ధైర్యంతో ఇవాళ మైసమ్మ గుళ్లను కూల్చి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకుంటామని అనుకోవడం పొరపాటని హెచ్చరిస్తున్నారు. కూల్చివేసిన గుళ్లను 48 గంటల పునర్ నిర్మించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.