న్యూఢిల్లీ, నవంబర్ 8: ఉత్తరాఖండ్‌లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరు కాకపోతే తమ పరువు పోతుందని భయపడిందో ఏమో కానీ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ), బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రధాని సభకు హాజరైన విద్యార్థులందరికీ 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ ఒక నోటీస్ కూడా జారీ చేసింది.
విద్యార్ధులను ఉద్దేశించి మోదీ ప్రసంగించే ఈ కార్యక్రమంలో విద్యార్ధులు.. ప్రధానితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. దీనిపై స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ నోటీసును ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రధాని మోదీ సభకు హాజరై మోదీ.. మోదీ అని నినాదాలు చేస్తే ఎన్ని మార్కులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జరిగే ప్రధాని సభకు విద్యార్థులు వస్తారో, రారో అన్న భయంతోనే యూనివర్సిటీ ఈ ఆఫర్‌ను ప్రకటించిందని పలువురు విమర్శిస్తున్నారు.