పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల వేళ పదుల సంఖ్యలో వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్) స్లిప్పులు రోడ్డు పక్కన దర్శనమివ్వడం కలకలం రేపింది. సమస్తిపూర్ జిల్లాలోని ఓ కళాశాల సమీపంలో వీవీప్యాట్ స్లిప్పులు శనివారం చెల్లాచెదురుగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆర్జేడీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. సరాయ్‌రంజన్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ఎవరి ఆదేశాల మేరకు, ఎప్పుడు, ఎలా వీటిని పారేశారని నిలదీసింది. “దొంగ కమిషన్’ దీనికి జవాబు చెప్తుందా? బయటి నుంచి వచ్చిన ‘ప్రజాస్వామ్యాన్ని దోచుకునే బందిపోట్ల’ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నదా?’ అని ప్రశ్నించింది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కే ఝా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు.
ఈవీఎంలను భద్రపరచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, ఈ స్లిప్పులు ఈ నెల 6న పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు నిర్వహించిన మాక్ పోల్‌కు సంబంధించినవని తెలిపింది. పోలింగ్‌కు ముందు ఈవీఎంలను పరీక్షించినపుడు ఈ స్లిప్పులు వచ్చాయని వివరించింది. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. సంఘటన స్థలానికి వెళ్లి, దర్యాప్తు జరపాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా మాట్లాడుతూ, అభ్యర్థుల సమక్షంలో ఆ వీవీప్యాట్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు అధికారులపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.