శ్రీరాంపూర్, నవంబర్ 8 : సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల విధానాలతో కార్మికులకు నష్టం కలుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఆరోపించారు. శనివారం శ్రీరాంపూర్‌లో సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి సమ్ము రాజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గట్టయ్య పాల్గొని మాట్లాడారు. సింగరేణి కార్మిక వర్గంపై బ్రిటీష్ కాలం నాటి కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల గొంతు నొక్కుతున్న ఈ విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, యాజమాన్యానికి అనుకూల వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ కార్మికులకు నెలకు 16 మస్టర్లు, సంవత్సరానికి 150 మస్టర్లు, సర్ఫేస్ కార్మికులకు నెలకు 20 మస్టర్లు, సంవత్సరానికి 200 మాస్టర్లు కచ్చితంగా చేయాలని సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ఈ సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్రవరింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న, రాష్ట్ర నాయకులు గోడిసెల శ్రీహరి, జైపాల్ సింగ్ దాసరి జనార్దన్ వెంకటేశ్, చందు, పోషన్న తదితరులు పాల్గొన్నారు.