సిరిసిల్ల టౌన్/ జమ్మికుంట, జనవరి 9 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై నిర్బంధం కొనసాగింది. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్‌ల పర్వం నడిచింది. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, అభివృద్ధి, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ సర్కారు ఖూనీ చేస్తున్నదని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు మొలుగు పూర్ణచందర్, ఇమ్రాన్, అనురాగ్, అమ్జదుల్లా ఖాన్, షేక్ అర్షద్‌ను అరెస్ట్ చేయగా, రేవంత్‌రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీణవంకలో మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపెల్లి మహేశ్, నియోజకవర్గ యువనేత నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు అన్నారం శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్ల సందీప్, సబ్బని హరీశ్, కంచర్ల రవిగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తంగళ్లపల్లి మండలంలో పార్టీ మండలాధ్యడు గజభీంకార్ రాజన్న, నాయకులు నవీన్‌రావు, కొమురయ్య, వెంకటరంగంను అదుపులోకి తీసుకొని, సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.