కలెక్టరేట్, మే 12: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం నెలకొంటుందనే విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా, కేవలం పదుల సంఖ్య లో మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయనే ఆవేదన ఆర్జీదారుల నుంచి వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నతాధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరగడంలేదని వాపోతున్నారు. సత్వర న్యాయం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు అందజేస్తున్నా.. కొన్నిశాఖల యంత్రాంగం మినహా మిగతాశాఖల్లో మాత్రం ప్రజావాణి ఫిర్యాదులపై ఎలాంటి స్పందన కానరావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకుంటూ, పరిష్కరించినట్లు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నారనే విమర్శలున్నాయి. ఫిర్యాదు చేసిన వారికి సమస్య పరిష్కారమైతే అయినట్లు, కాకుంటే ఎందుకు కాలేదో వివరణతో కూడిన సమాధానం 15రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇవేమీ పాటించకుండా ఫిర్యాదు దారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్జీదారులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుండడం షరామామూలుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సోమవారం నాటి ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి 264 మంది దరఖాస్తులు అందజేయగా, వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందిన ఫిర్యాదులే ఉన్నాయి. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితోపాటు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కే మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
మా గ్రామ శివారులోని సర్వేనంబర్ 215లో 28గుంటల భూమిని 2011లో అప్పటి ప్రభుత్వం తన పేరిట పట్టా చేసి.. కాగితాలు అందజేసింది. 15ఏండ్లుగా తమ కుటుంబం ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. 2024లో తహసీల్దార్‌గా వచ్చిన రమేశ్ సారు మా కొడుకును ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. మీకు ఇచ్చిన భూమి పట్టా రద్దు చేయకుండా ఉండాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని అడిగిండు. మా వద్ద డబ్బుల్లేవని చెప్పినా పట్టించుకుంటలేడు. ఈ విషయమై ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. తాను బదిలీ అయి వెళ్లేలోగా పట్టా రద్దు చేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. తన భూమిలో ఉన్న గుంతను పూడ్చుతుండగా రెవెన్యూ అధికారులను పంపి మెమో ఇచ్చిండు. కులం సర్టిఫికేట్ కోసం నా కోడలు దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడం లేదు. సదరు అధికారిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోకుండా కాపాడండి.
నగర సమీపంలోని మానేరు నది ఒడ్డున ఉన్న డంపింగ్‌యార్డుతో కొన్నేళ్ల నుంచి కోతిరాంపూర్, అలకాపురి, హౌసింగ్‌బోర్డు ప్రాంతాల్లోని తాము ఇబ్బంది పడుతున్నాం. యార్డు నుంచి వచ్చే పొగ, వాసన భరించలేక రోగాల పాలవుతున్నాం. పసి పిల్లలు, గర్భిణులు, వయోవృద్ధుల బాధలు వర్ణాతీతం. దగ్గు, దమ్ము, గుండె సంబంధిత వ్యాధులబారిన పడుతున్నాం. వెంటనే డంపింగ్ యార్డు ఎత్తివేసి, వేలాది మందిని అనారోగ్యాల బారినుంచి కాపాడాలి.