కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్ : ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగర్ నగరాన్ని గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏండ్ల తరబడి పాలించిన ఆంధ్రా పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధి అంటేనే నిర్లక్ష్యం చేశారు. మున్సిపాలిటీ పన్నులతో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప, ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాదనల మేరకు సీఎం కేసీఆర్ రూ.వేలాది కోట్లు మంజూ రు చేస్తూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి తో డ్పడ్డారు.
ముఖ్యంగా నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం అష్యూరెన్స్ పథకం కింద రూ.350 కోట్లు తెచ్చిన మంత్రి గంగుల, నగరంలోని రోడ్లన్నింటినీ సీసీగా మార్చేశారు. భారీ మురుగు నీటి కాలువలు నిర్మించారు. రాత్రిపూట జిగేల్మనే సెంట్రల్ లైటింగ్ వ్య వస్థను ఏర్పాటు చేశారు. రోడ్ల అభివృద్ధితోపాటు కూడళ్లు, చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరం, నియోజకవర్గంలోని రెండు మం డలాల్లో ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నగరవాసులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రూ.110 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రతి రోజూ నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజుల్లో 24గంటల పాటు మంచి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల నుంచి వస్తు న్న డిమాండ్ మేరకు పనులు చేపడుతున్నారు.
అభివృద్ధిలో మైలురాళ్లు
కరీంనగర్‌ను అత్యంత సుందరంగా తీర్చిదడమే కాకుండా, జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులను మంత్రి గంగుల చేపట్టారు. ముఖ్యంగా మానేరుపై రూ.220 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి జిల్లాకే తలమానికంగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవలే ఈ వంతెనను ప్రారంభించారు. ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడ నిర్వహిస్తున్న వీకెండ్ మస్తీ నగరవాసులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచుతోంది. అలాగే, రూ.410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు 30 శాతానికి పైగా పూర్తయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటక స్థలాల్లో దేశవిదేశాలను ఆకట్టుకోనుంది. ఆసియాలోనే మూడో అత్యంత ఎత్తయిన వాటర్ ఫౌంట్ను ఇక్కడ నిర్మిస్తున్నారు.
ఇవి కాకుండా కరీంనగర్ జిల్లా వాసుల చిరకాల కోరికగా నిలిచిన మెడికల్ కళాశాలను మంత్రి గంగుల సాధించారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రూ.100 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం సాగుతోంది. ఈ ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా, కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం చేపట్టారు. మానేరు ఒడ్డున రూ.22 కోట్లతో ఐటీ టవర్‌ను నిర్మించిన మంత్రి గంగుల, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ఇలాంటి మైలు రాళ్లను దాటుతూనే మరో పక్క అధ్యాత్మికంగా కూడా నగరానికి వన్నె తెస్తున్నారు. పద్మనగర్‌లో 10 ఎకరాల్లో తిరుమల తిరుపతి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇస్కాన్ ఆలయాన్ని కూడా నిర్మించేందుకు భూమి పూజ చేశారు. ఇలా అన్ని రంగాల్లో నగరాన్ని విశిష్టంగా నిలిపేందుకు మంత్రి గంగుల కమలాకర్ కృషి చేస్తున్నారు.
నేడు నగరంలో ప్రజా ఆశీర్వాద సభ
అభివృద్ధికి చిరునామాగా నిలిపిన మంత్రి గంగుల కమలాకర్‌ను అధికార బీఆర్ఎస్ మరోసారి కరీంనగర్ నుంచి పోటీలో నిలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన బుధవారం కరీంనగర్‌లోని పద్మనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నాయకులు చూస్తున్నారు.
పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి : మంత్రి గంగుల
నగరంలోని రాంనగర్‌లోని ఎక్స్బిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు అన్ని స్థాయిలో పూర్తి ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సదుపాయం ఇతర ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని సూచించారు. ఆయన వెంట నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, పార్టీ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్రావు, నాయకులు మహిపాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.