కరీంనగర్ ముకరంపుర/ కరీంనగర్‌రూరల్, మే 3 : కరీంనగర్ శివారులోని దుర్శేడు 220 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వెంట ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలోనే సబ్ స్టేషన్ ఉండడం.. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో సబ్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుర్శేడ్ సబ్‌స్టేషన్‌కు రామగుండం, రామడుగు పంప్‌హౌస్ నుంచి 220 కేవీ లైన్ల ద్వారా ఇన్ కమింగ్ సరఫరా ఉంది. కాగా, ఇకడి నుంచి బొమ్మకల్ శివారులోని హైదరాబాద్ మెట్రో పంప్‌హౌస్, మల్లారం పంప్‌హౌస్‌తోపాటు సిద్దిపేట 220కేవీ సబ్స్టేషన్లకు సరఫరా జరుగుతుంది.
ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల వేడి తీవ్రతకు ఇకడి నుంచి హుజూరాబాద్‌కు వెళ్లే 132 కేవీ లైన్ ట్రిప్ అయి ఆ ప్రాంతానికి సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన ట్రాన్స్ కో అధికారులు, సిబ్బంది కరీంనగర్‌లోని 33/11 కేవీ అంబేదర్నగర్, రేణికుంట, అల్గునూర్ సబ్స్టేషన్లకు కొద్దిసేపు సరఫరా నిలిపివేశారు. సబ్ స్టేషన్‌కు కొద్ది దూరంలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సబ్ స్టేషన్లోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావించి కరీంనగర్- గోదావరిఖని ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు, సమీప గ్రామాల వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో సబ్‌స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.