ఫౌల్ట్రీ రైతులకు లాభాలు రాకుండా చేసిన ఇంటిగ్రేషన్ కంపెనీలు ఇప్పుడు తమపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాయని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. లైవ్ బర్డ్స్‌పై ఇటీవల భారీగా ధరలు పెంచి, మార్జిన్ తగ్గించి తమ వ్యాపారాలు దెబ్బతినేలా చేసిన ఆ కంపెనీలతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా నేటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు పలు నగరాలు, పట్టణాల్లో చికెన్ షాప్‌లను బంద్ చేస్తున్నారు. కంపెనీలు దిగి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా చికెన్ సెంటర్లు మూసివేస్తామని స్పష్టం చేస్తున్నారు. జంట నగరాల్లో బంద్‌కు కరీంనగర్ జిల్లా నుంచి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు.
కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఇటీవల చికెన్ ధరలు చుక్కలు చూపించాయి. ఈ నెల 23 నుంచి ఆకాశాన్నంటాయి. కిలో 370 నుంచి 400 వరకు పెరగడంతో వినియోగదారులపైనే కాదు, చికెన్ సెంటర్ల నిర్వాహకులపై భారం పడింది. దీనంతటికీ బాయిలర్ ఇంటిగ్రేషన్ కో ఆర్డినేషన్ కమిటీ (బీఐసీసీ) కారణమని భావించిన రాష్ట్ర చికెన్ సెంటర్ల యజమానుల అసోసియేషన్.. ధరలు తగ్గించకుంటే దుకాణాలు నిరవధిక బంద్ చేస్తామని హెచ్చరించింది. దీంతో బీఐసీసీ దిగిచ్చి, ఒక్క రోజులోనే 100 నుంచి 90 తగ్గించింది. అయినా ఈ ధరలు స్థిరంగా ఉంటాయన్న నమ్మకం కుదరని చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇక బీఐసీసీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చికెన్ లైవ్ బర్డ్స్ ధరలు పెంచుతున్నదని, తమకు వచ్చే మార్జిన్ కూడా తగ్గించిందని ఆగ్రహిస్తున్నారు. ఒక నిర్దిష్టమైన ధర ఉంటేనే తమ వ్యాపారాలు సాగుతాయని, రోజుకో తీరు ధర పెంచుతూ బీఐసీసీ తమ వ్యాపారాలు సాగుకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని పలు హాచరీస్తో ఏర్పడిన బీఐసీసీ.. ముందుగా బాయిలర్ రైతులను కోలుకోకుండా చేసింది. కోళ్ల దాణా పెంచడం, లైవ్ బర్డ్స్‌ను చికెన్ సెంటర్లకు నేరుగా తక్కువ ధరకే సరఫరా చేయడంతో బాయిలర్ కోళ్లను పెంచిన రైతులు నష్టాలపాలై వెనక్కి తగ్గడం, లేదంటే ఏదో ఒక ఇంటిగ్రేషన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని కమీషన్‌పై ఫౌల్ట్రీ ఫాం నడిపించే స్థాయికి తెచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న బాయిలర్ ఫౌల్ట్రీ రైతులు ఇప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయారు. నాడు రైతుల నుంచి నేరుగా లైవ్ బర్డ్స్ కొనుగోలు చేసుకున్న చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇప్పుడు బీఐసీసీ పరిధిలోని ఏదో ఒక ఇంటిగ్రేషన్ కంపెనీపై ఆధారపడుతున్నారు. ఈ బీఐసీసీ నిర్ణయించిన ధరలకే చికెన్ అమ్ముతున్నారు. దీంతో క్రమంగా నష్టాల్లో కూరుకుపోతున్నారు. చికెన్ ధరల్లో స్థిరత్వం లేకపోవడం, లైవ్ బర్డ్‌పై మార్జిన్ తగ్గించడం వల్ల నష్టాలు చూస్తున్నారు. నిజానికి లైవ్ బర్డ్స్‌ను వెన్‌కాబ్, స్నేహ వంటి సంస్థలు ప్రకటించే ధరకు విక్రయించాల్సి ఉంటుంది. ఆ రోజు ఉన్న ధరలపై 26 మార్జిన్‌తో అమ్ముకోవాల్సి ఉంటుంది. అదే చికెన్ ధరకు వచ్చే సరికి 26పై 1.65 మార్జిన్ ప్రస్తుతం ఇస్తున్నారు. అయితే ఆ రోజు ఉన్న ట్రేడర్ ధరపై తమకు 1.75 మార్జిన్ ఇవ్వాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక కిలో లైవ్ బర్డ్‌ను డ్రెస్సింగ్ చేసి ఇస్తే ఇప్పుడు 42.90 ఇస్తున్నారు. దీనిని 45.50కి పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్‌ను అంగీకరించని పక్షంలో చికెన్ సెంటర్లను మూసి వేస్తామని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. బీఐసీసీ దిగి రాకపోవడంతో బుధవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు పలుచోట్ల చికెన్ సెంటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ చికెన్ సెంటర్ల యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి దశలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు పలుచోట్ల చికెన్ సెంటర్లు మూసి వేయనున్నారు. ఒక వేళ బీఐసీసీ దిగిరాని పక్షంలో ఈ దుకాణాల నిరవధక మూసివేత రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సంఘం అధ్యక్షుడు మహ్మద్ నవాబ్ మంగళవారం కరీంనగర్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీఐసీసీ దిగిరాకుంటే ఏ క్షణంలోనైనా జిల్లాలో కూడా చికెన్ సెంటర్లు బంద్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఐసీసీతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు, వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని, తాము నష్టపోతూ ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలకు లాభాలు ఇవ్వాల్సి వస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. చికెన్ ధరలు పెంచడంతో అమ్మకాలు పడిపోతున్నాయని, సెంటర్ల నిర్వాహకులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోయారు. వేములవాడలోనూ చికెన్ సెంటర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. బాయిలర్ కోళ్ల ట్రేడర్స్ నిర్వాహకులతో తాము పూర్తిగా నష్టపోతున్నామని వాపోయారు. నేటి నుంచి చేపడుతున్న బంద్‌కు వినియోగదారులు సహకరించాలని కోరారు.