ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం మెలికల మీద మెలికలు పెడుత్నుది. ఎప్పుడో ఏండ్ల కింద మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రస్తుత యాప్‌లో అప్లోడ్ చేసి, వారికి ఇప్పుడు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నది. ఇక కారు, వ్యాను, ట్రాక్టర్, తదితర నాలుగు చక్రాల వాహనాలు ఉంటే కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నది. ఆధార్ కార్డు ఆధారంగా కూడా పరిశీలించి, ఇలాంటి వారిని జాబితా నుంచి తొలగిస్తున్నది. దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్‌లో ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పథకం కింద లబ్ధిపొందిన దళితులెవరికీ ఇళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా అనేక అవాంతరాలు దాటితే గానీ, సొంతింటి కళ నెరవేరేలా లేదు.
కరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలంటే అనేక అడ్డంకులు దాటాల్సి వస్తున్నది. ప్రభుత్వం పెట్టిన మెలికల కారణంగా నిరుపేదలు ప్రయోజనం పొందలేని పరిస్థితి ఏర్పడుతున్నది. పైలెట్ గ్రామాల్లో ఇప్పటికే వడబోసి ఎంపిక చేసిన అధికారులు, 600 చదరపు అడుగులు దాటితే బిల్లులు వచ్చే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. ఇక ఇతర గ్రామాల్లో రెండో విడుతగా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసి ఇచ్చిన లబ్ధిదారుల జాబితాను కూడా ఇదే విధంగా వడబోస్తున్నారు. మెలికలతో అర్హుల జాబితా పూర్తిగా తగ్గిపోతున్నది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లోనే అనేక కొర్రీలు పెట్టి, లబ్ధిదారుల జాబితాను తగ్గించాలని నిర్ణయించినట్టు అర్థమవుతున్నది. ఈ విషయం ఇప్పుడు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల సమయంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఇప్పుడు అనర్హులుగా తేలుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏండ్ల నుంచి ఇల్లు పొందిన వారి జాబితాను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేసి పెట్టారు. గ్రామాల నుంచి లబ్ధిదారుల జాబితా రాగానే ఆన్లైన్లో పరిశీలిస్తున్నారు. దీంతో గతంలో లబ్ధిపొందిన వారి పేర్లు ఆటోమెటిక్‌గా బహిర్గతం అవుతుండడంతో ఈ పేర్లను అనర్హులుగా ప్రకటిస్తున్నారు. నలభై, యాభై ఏండ్ల కింద గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టుకున్న వారికి అప్పటి పరిస్థితులు బట్టి 6 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చారు. అయితే, చాలా మంది ఇండ్లు కట్టుకోక పోవడంతో ల్యాప్స్ అయ్యాయి. అయినా, వాటిని చూపి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇల్లు మంజూరైనా తాము కట్టుకోలేదని నెత్తీనోరు మొత్తుకున్నా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఏండ్ల తరబడిగా ఇండ్లు లేక నిరీక్షిస్తున్న వందలాది నిరుపేదలు ప్రభుత్వం పెట్టే మెలికల కారణంగా అన్యాయానికి గురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలంటే మరో కొత్త మెలిక పెట్టారు. కారు, వ్యాన్, ట్రాక్టర్, తదితర నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇందిరమ్మ ఇంటికి అనర్హులుగా తేల్చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఇలాంటి వారిని గుర్తిస్తున్నారు. గతంలో కుటుంబాలు గడవడానికి బ్యాంకులు, ఫైనాన్స్‌లలో అప్పులు చేసి కారు, ఇతర ఫోర్ వీల్ వాహనాలు కొనుగోలు చేసుకున్న వారిలో చాలా మంది అమ్ముకున్నారు. కానీ, ఆన్లైన్లో మాత్రం వారికి వాహనాలు ఉన్నట్టు చూపుతున్నది. ఇలాంటి వారు తమకు ఫోర్ వీలర్ వాహనాలు లేవని అధికారులు చుట్టూ తిరుగుతున్నా వారు ససేమిరా ఒప్పుకోవడం లేదు. కార్లు, ఇతర ఫోర్ వీలర్స్ అమ్ముకున్నట్టు ఆధారాలు చూపాలని మెలిక పెడుతున్నారు. కొందరు వీటిని సమర్పించినా ఇప్పుడే ఎంపిక చేసేందుకు వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితులు దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇక్కడ 18,021 మందిని దళితబంధు కోసం ఎంపిక చేశారు. వీరిలో సుమారు 8 వేల మంది వాహనాలు కొనుగోలు చేసుకున్నారు. అందులో ఇండ్లు లేని దళితులు వందల సంఖ్యలో ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి పూర్తి సబ్సిడీపై వాహనాలు అందించింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిర పడుతున్న దళితులు ఈ ప్రభుత్వంలో ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామని ఆశిస్తే అందుకు ప్రభుత్వ నిబంధనలు మోకాలు అడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో 30 నుంచి 40 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా ఉన్నారు. వీరిలో ఒక్కరిని కూడా అధికారులు ఎంపిక చేయడం లేదు. జాబితాలో పేర్లు రావడంతో ఉన్న ఇంటిని కూల్చుకున్న దళితులకు చావు కబురు చల్లగా చెప్పినట్టు ‘మీకు దళిత బంధులో వాహనాలు వచ్చిన కారణంగా ఇందిరమ్మ ఇల్లు రావడం లేదు’ అని స్పష్టం చేస్తున్నారు. తాము ఇల్లు కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నామని అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడం లేదని హుజూరాబాద్‌కు చెందిన దళితులు వాపోతున్నారు. ఈ పరిస్థితి జిల్లా మొత్తంలో కనిపిస్తున్నది.
గతంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు మంజూరై నిర్మించుకోకుండా వదిలేసిన నిరుపేదలకు ఇప్పుడు అన్యాయం జరుగుతున్నది. గతంలో మంజూరైన ఇండ్లకు వేలల్లో మాత్రమే చెల్లించే వారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పడంతో ఇల్లు లేని నిరుపేదలు ఆశ పడ్డారు. మొదటి విడుతగా మండలానికి ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో విడుతకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతుండగా, ప్రభుత్వం పెట్టిన నిబంధనల కారణంగా ఎంపికైన అనేక మందిని రిజెక్ట్ చేస్తున్నారు. అయితే, గతంలో ఇల్లు మంజూరై కట్టుకోకుండా వదిలేసిన వారికైనా మినహాయింపు ఇవ్వాలని నిరుపేద లబ్ధిదారులు కోరుతున్నారు. కొందరు అప్పట్లో ఎలాంటి బిల్లులు తీసుకోకున్నా తీసుకున్నట్టు ఆన్లైన్లో చూపుతున్నట్టు తెలుస్తున్నది. నాలుగు స్టేజీల్లో బిల్లులు తీసుకునేవారు. ఆ నాలుగు స్టేజీల్లో ఫొటోలు తప్పని సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి ఫొటోలు ఇవ్వకుండానే కొందరి పేర్ల మీద బిల్లులు చెల్లించినట్టు చూపుతున్నది. ముఖ్యంగా 2007-08లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లలో చాలా మందికి బిల్లులు రాలేదు. కానీ, అధికారులు ప్రస్తుతం అప్లోడ్ చేసిన యాప్‌లో మాత్రం బిల్లులు తీసుకున్నారని చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి లబ్ధిదారుల గురించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించి నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఎంత మంది లబ్ధిదారులను తగ్గించుకుంటే అంత భారం తగ్గుతుందనే భావనలో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అర్హత ఉన్నా వందలాది మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతున్నట్టు స్పష్టమవుతున్నది.