Politics heat | కోరుట్ల రూరల్, ఆగస్టు 2: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో ఒక్కసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, యూరియా పంపిణీ విషయంలో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. దీంతో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గల రైతువేదిక వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇటు కాంగ్రెస్ నాయకులు, తాము ఎలాంటి చర్చకైనా సిద్ధం అంటూ.. ఇటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిజయోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో రైతు వేదిక వద్దకు చేరుకొని చర్చలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొద్ది సేపు తోపులాట చేసుకుంది. పోలీసులు ఇరుపక్షాల నాయకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. గ్రామంలోని బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు వెనుదిరిగారు.
ఈసందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మట్లాడుతూ రైతులు యూరియా బస్తాలు రెండు కొనుగోలు చేయాలంటే ఒక జింక్ బస్తాను కొనాలనే నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం విధించడం సమంజసం కాదన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు యూరియా బస్తాలు ఇచ్చారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎసీఎస్ కేంద్రాల్లో రైతులకు సరిపడా యూరియా బస్తాలు లేవన్నారు. ఈ విషయమై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని కాని పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమంగా మా నాయకులను ఆరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.