murder | రామగిరి, అక్టోబర్ 10 : రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్, కత్తి తో కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికుల కథనం ప్రకారం, మృతుడు న్యూమారేడుపాక పోతనకాలనీకి చెందినవాడు కాగా, మీసేవా కేంద్రం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హత్య జరిగిన సమయంలో చిరంజీవి సెంటినరీకాలనీలోని ఐకేపీ కార్యాలయానికి రాగానే అదే సమయంలో ముగ్గురు దుండగులు అతని మీద దాడి చేసి, రాళ్లతో అతి దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు మృతుడి భార్య కొంతకాలం క్రితమే మృతి చెందిందని, అనంతరం చిరంజీవి మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇదే పరిణామం ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు, రామగిరి ఎస్ఐ టీ శ్రీనివాస్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.