బీఆర్ఎస్పై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు రావొచ్చని, ఇక్కడి నుంచి హైదరాబాద్ తరలివెళ్తారని గ్రహించిన పోలీసులు గురువారం రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. నాయకుల ఇండ్లలోకి వెళ్లి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. ఫోన్లు చేసి స్టేషన్లకు రావాలని నాయకులు, కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. శుక్రవారం ఏ పోలీస్ స్టేషన్లో చూసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కనిపించారు. బలవంతంగా స్టేషన్లలో ఉంచుకుని కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోబెట్టారు. ఏ తప్పూ చేయకున్నా తమనెందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించినా సమాధానం లేదని నాయకులు మండిపడ్డారు. ఇది పోలీసుల అత్యుత్సాహమని, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.
-కరీంనగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను గృహ నిర్బంధం చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులను ఏర్పాటు చేశారు. చొప్పదండి మండలంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ భర్త మాచర్ల వినయ్‌ను ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేయగా, గంగాధర మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావుకు ఫోన్లు చేసి రప్పించుకుని మరీ నిర్బంధించారు. కరీంనగర్లో పార్టీ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, దిండిగాల మహేశ్, గందె మహేశ్, ఎడ్ల అశోక్, ఐలెందర్యాదవ్తో పాటు మరి కొందరిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండల్లో పలు గ్రామాల నాయకులను అరెస్ట్ చేశారు. గన్నేరువరంలో మండల శాఖ అధ్యక్షుడు గంప వెంకన్నతో పలువురు నాయకులను గంటల తరబడి స్టేషన్లో ఉంచారు. తిమ్మాపూర్ మండలంలో మండలాధ్యక్షుడు రావుల రమేశ్, మానకొండూర్ మండలాధ్యక్షుడు రాయికంటి కిరణ్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. చిగురుమామిడి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు బండ శ్రీనివాస్‌తోపాటు కౌన్సిలర్లు, నాయకులను ముందుగానే అరెస్ట్ చేశారు. వీణవంక మండలం చల్లూరులో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ మండలంలోని కిష్టంపేట, వీణవంక, గన్ముక్కుల, ఎలుబాక, రెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. జమ్మికుంటలో పలువురు కౌన్సిలర్లు, నాయకులను అరెస్టు చేశారు. ఇల్లందకుంట నుంచి జవ్వాజి కుమార్‌స్వామి, ఆలేటి శ్రీరాంను ఇండ్లలో ఉండగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మా పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇండ్ల నుంచి బలవంతంగా తీసుకొచ్చి, ఫోన్ చేసి బెదిరించి పిలిపించుకుని గంటల తరబడి స్టేషన్లలో కూర్చోబెట్టుకున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు. మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అయితే ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు. మాకు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ తప్పూ చేయనప్పుడు స్టేషన్లలో గంటల తరబడి ఎందుకు కూర్చోబెట్టినట్లు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.