Rajanna siricilla BRS | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: హెచ్సీయు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థుల పోలీసుల దాడి సిగ్గు చేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. లాఠీచార్జిని ఖండిస్తూ స్థానిక నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులో కలిసి మోకాళ్లపై కూర్చుని చేతులకు సంకెళ్లు ధరించి గురువారం నిరసన తెలిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆస్తులను దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. హెచ్సీయులో 400ల ఎకరాల స్థలంలోని చెట్లను నరికివేస్తుంటే అడ్డుకోబోయిన విద్యార్థులపై పోలీసులు లారీలు విరిగేలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న చోట ప్రభుత్వం కుట్రతోనే విధ్వంసం సృష్టించిందన్నారు.
చెట్లు నరికివేయడాన్ని నిలిపేసి వన్యప్రాణులను కాపాడాలని కోరిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించడం దిక్కుమాలిన చర్యగా పేర్కొన్నారు. భూముల పరిరక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, అనిల్, వినయ్, దేవరాజు, ముజ్జు, గణేష్, రాజు, నరేష్, వేణు మోహన్, పరమేష్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.