వీణవంక, నవంబర్ 10: దళితులపై కాంగ్రెస్ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితబంధు రెండో విడుత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గ దళితబంధు సాధన సమితి సభ్యుడు కొలుగూరి సురేశ్, వీణవంక మాజీ ఉపసర్పంచ్ వోరెం భానుచందర్ డిమాండ్ చేశారు. లేదంటే రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. దళితులకు రెండో విడుత దళితబంధు నిధులు విడుదల చేయాలని శనివారం హుజూరాబాద్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు దాడి చేసి, అరెస్ట్ చేయడం అమానుషమని మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా ప్రెస్మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం దళితబంధు సాధన సమితి సభ్యులు, స్థానిక దళితులు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాంగ్రెస్ విస్మరిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. 11 నెలలుగా దళితబంధు రెండో విడుత నిధుల కోసం పో రాటం చేస్తుంటే.. 19సార్లు ప్రభుత్వం దళితులను అరెస్ట్ చేసిందన్నారు.
కాంగ్రెస్ ఇన్చార్జి ప్రణవ్‌కు అసలు తమ బాధలు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి సభ్యులు కొలుగూరి నరేశ్, దాసారపు నాగరాజు, శ్రీకాంత్, భిక్షపతి, ఆకాశ్, విజయ్, రమేశ్, రక్షిత్, పోతుల సురేశ్, నాయకులు గజ్జెల శ్రీకాంత్, వోరెం మధు, క్రాంతి, దాసారపు కొమురయ్య, రాజు, ఓదయ్య, రాజేందర్, కృష్ణచైతన్య, దిలీప్ పాల్గొన్నారు.