జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బాలికల కళాశాల అది. అక్కడ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఒక జిల్లా నుంచి వచ్చిన ఒక ఉపన్యాసకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. నలభై ఏండ్లకు పైబడి వయసున్న సదరు ఉపన్యాసకుడు మొదటి నుంచి అమ్మాయిలతో అదో రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అవసరం లేకున్నా తాకడం, చేతులు వేయడం ఆరంభించాడు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక గ్రామానికి చెందిన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దుర్మార్గమైన ఆలోచనను పసిగట్టిన అమ్మాయిలు, అతడిని అసహ్యించుకోవడం మొదలుబెట్టారు.
ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాక కొన్నాళ్లు ఓపిక పట్టారు. ఉపన్యాసకుడి చేష్టలు శ్రుతిమించడంతో విద్యార్థిని తన ఇంట్లో చెప్పింది. ఆగ్రహానికి గురైన విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు బంధువులు కాలేజీకి చేరుకొని సదరు ఉపన్యాసకుడిని ప్రశ్నించారు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చేయి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. దీంతో సదరు ఉపన్యాసకుడు అప్రమత్తమై, బాధిత విద్యార్థినితోపాటు ఆమె తల్లి కాళ్లను విద్యార్థుల ముందే మొక్కి క్షమించాలని వేడుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక మండల జూనియర్ కాలేజీలో పనిచేసే ఇద్దరు ఉపన్యాసకులు కాలేజీ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడంతోపాటు కాలేజీలో అసభ్యంగా ప్రవర్తించడంతో పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లెక్చరర్ కొన్నేళ్లుగా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది. ‘హోంవర్క్ ఎందుకు చేసుకురాలేదు? రాత్రి బాగా బిజీనా.. ఎప్పుడు మాస్క్ వేసుకొనే ఉంటవా.. కండ్లే కనిపిస్తున్నయి.
అన్నీ చూడాలె. మాస్క్ తీయు’ ఇలాంటి కామెంట్లు చేయడంతోపాటు అమ్మాయిల సెల్ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారని పిల్లలు ఆరోపించారు. విషయం తల్లిదండ్రుల వరకు చేరడంతో వారు కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్, లెక్చరర్లతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించగా, నలుగురు అమ్మాయిలు వాగ్మూలం ఇవ్వడంతో సదరు లెక్చరర్‌పై పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, అందులో ఓ లెక్చరర్ వయసు యాభైకి పైగా ఉండడం గమనార్హం.
జగిత్యాల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులంటే సమాజానికి ఆదర్శంగా ఉండేవారు. విద్యాబుద్ధులతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు. కానీ, కొందరు టీచర్లు తమ వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. తమ చేష్టలతో ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ వయసును సైతం మరిచిపోయి మనుమరాళ్ల వయసులో ఉన్న చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాయని మచ్చను వేసుకుంటున్నారు.
అభంశుభం తెలియని అమ్మాయిలపై చేతులు వేస్తూ.. శరీరాలను తాకుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అడ్డంగా దొరికిపోయి కేసుల పాలవుతున్నారు. కొందరు సస్పెండ్ కూడా అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుండగా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఆడపిల్లల క్షేమం దృష్ట్యా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా వ్యవహరించారు. చేతులు వేయడం, శరీరాన్ని తాకుతుండడంతో విద్యార్థినులు తమ ఇంట్లో చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఒక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఒక టీచర్ రిమాండ్ కాగా, మరో ఉపాధ్యాయుడు ఇంకా అబ్స్కాండింగ్లోనే ఉన్నాడు. కేసులో ఇరుక్కున్న ఇద్దరి వయసు సైతం నలభై ఐదుకు పైగానే ఉండడం గమనార్హం.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిది మరో మూడు నెలలు అయితే ఉద్యోగ విరమణ పొందే సమయం. ఈ వయసులో పోక్సో కేసు బారిన పడి రిమాండ్‌కు వెళ్లాడు. మారిన సాంకేతిక నైపుణ్యాల నేపథ్యంలో విద్యార్థుల హాజరు నమోదుతోపాటు పిల్లల చదువు, ప్రగతి వివరాలను ఇంటికి చేరవేసే వరకు అన్నింటికీ సెల్‌ఫోన్ అవసరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతి ఉపాధ్యాయుడికి ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తెలిసిపోతున్నాయి.
కాగా, కొందరు ఉపాధ్యాయులు ఆ నంబర్ల ద్వారా పిల్లలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సదరు ఉపాధ్యాయుడు అలాగే వ్యవహరించి పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రిటైర్మెంట్కు మరో ఆరు నెలల దూరంలో ఉన్న ఉపాధ్యాయుడిపై సైతం ఇలాంటి ప్రవర్తనతోనే పోక్సో కేసు నమోదైంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఉపాధ్యాయుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల తన ఇంటి సమీపంలో ఉండే బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ బాలిక తల్లికి చెప్పడంతో ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి, పోక్సో కేసు నమోదు చేశారు. మూడు నాలుగు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్ చేశారు.