Siricilla | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 11( నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి రావడం పై ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హత్యా రాజకీయాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ, హత్య రాజకీయాలను సహించబోమని నినాదాలు చేశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్యకు బీఆర్ఎస్కు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులపై రుద్దే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సిరిసిల్ల పోలీసులపై తమకు, మా పార్టీకి అపారమైన గౌరవం ఉన్నదని, వెంటనే వెంకటేశం ను హత్య కేసులో నిందితులు, పాత్రదారులు, సూత్రధారులను పట్టుకుని రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.