Urban cleanliness | పెద్దపల్లి, మే12: పెద్దపల్లి పట్టణ శుభ్రతతో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించడం వంటి పలు అంశాలపై సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను ప్రజలు వేర్వేరుగా సేకరించాలని సూచించారు. ఇక నుంచి మంగళ వారం, శుక్రవారం మాత్రమే పొడి చెత్త సేకరించాలని, మిగిలిన రోజులలో తడి చెత్త సేకరించాలని, ఈ విషయంపై పట్టణవాసులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రతీ వార్డు పరిధిలో చెత్త అధికంగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, డ్రైయిన్ సమస్యలపై వార్డు ఆఫీసర్లు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. వార్డు ఆఫీసర్ ప్రతీరోజు ఉదయం ఫీల్డ్‌లో అందుబాటులో ఉండి చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ తరలింపు వంటి అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రతీ వారం వార్డు అధికారులు వారి పరిధిలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేసి అందిస్తున్న ఇండ్లను ఎంపిక చేసుకుని వారికి బహుమతులు అందించి సన్మానించాలని, మున్సిపాలిటీ సహకరిస్తున్న ఇండ్లకు స్వచ్ఛ హౌస్ స్టిక్కరింగ్ అంటించాలన్నారు.
ఒక వార్డులో స్వచ్ఛ హౌస్ ఎన్ని ఉన్నాయనే దాని పై వార్డు అధికారుల పని తీరు తెలుస్తుందని చెప్పారు. ఒక రోజులోనే మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ఆరు నెలల పాటు కృషి చేస్తే ప్రజలలో నుంచి మార్పు సాధ్యమవుతుందన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, చెత్తను పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.