Korutla | కోరుట్ల, ఆగస్టు 16: వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం ఆయన కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో నివాసముంటున్న వారు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమయంలో మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని వసతి, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
వర్షాకాలం ప్రజలకు 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉంటారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. అనంతరం పట్టణ శివారులోని మద్దుల చెరువు, తాళ్లచెరువు ముత్తడి వద్ద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ కేడ్ల ను ఏర్పాటుచేసి రాకపోకలు నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్ లో వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు వార్డుల్లో రహదారిపై నిలిచిన నీటిని జేసీబీ, ఎక్స్వేటర్ సాయంతో మట్టిని తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా పనులు జరిపించారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం రాజేంద్రప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్(9949565606), ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ (9849907961) కంట్రోల్ రూమ్ (9100039255)లను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు.