BRS leader Harish Reddy | కోల్ సిటీ, ఆగస్టు 21: కూల్చివేతలో కూడా అధికారులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదని, కనీసం దుకాణాల్లోని సామగ్రిని కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలమట్టం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల హరీష్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. కూల్చివేతల సమయంలో వ్యాపారులు ఆ శిథిలాల కింద పడి చనిపోతే బాధ్యులెవరని, అయినా ఆ సమస్య కోర్టు పరిధిలో ఉండగా అధికారులు ఆగమేఘాల మీద అంత హడావిడిగా కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, అభివృద్ధికి ప్రజలే కాదు తాము కూడా వ్యతిరేకం కాదని, కానీ ఇంతటి తుగ్లక్ పాలన అవసరమా హరీష్ రెడ్డి ప్రశ్నించారు.
గోదావరిఖని పోచమ్మ మైదానంలోని భవనాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేసిన సంఘటనపై ఆయన ఆవేదన చెందారు. సంఘటన స్థలాన్ని గురువారం సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులను కలిసి మాట్లాడారు. ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు, వ్యాపారుల జీవితాలతో చెలగాటం అంత మంచిది కాదనీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రామగుండంను హైదరాబాద్ తరహా అభివృద్ధి చేస్తానని బుల్డోజర్లు తీసుకొచ్చి ఉన్న భవనాలు కూల్చడం కాదనీ, చుట్టు పక్కల నగరంను విస్తరించేలా ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
వ్యాపారులు దుకాణాల నుంచి సామగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా మానవత్వం మరిచి వ్యాపారులు అందులో ఉండగానే భవనాలను ఎక్స్ కవేటర్లతో కూల్చడమే అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ బుల్డోజర్ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రామగుండంలో రౌడీ రాజకీయం ఇంకెంత కాలమో ఉండబోదన్నారు. కూల్చివేతలతో నష్టపోయిన వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కూల్చివేతల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే పోయిన ప్రాణాలు తీసుకవస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వీహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు సిగిరి రాము, కడమండ శ్రీహరి, అల్లి గణేశ్, శ్యాంసుందర్, కొండ సురేశ్, తిరుమల్, ప్రవీణ్, బొల్లం మధుబాబు తదితరులు పాల్గొన్నారు.