మెట్పల్లి మారుతీనగర్, జూన్ 3 : చేయూత పింఛన్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పింఛన్దారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎండలో ఇబ్బందులు పడుతున్నారు.
బ్యాంకు ఖాతాలులేని వారికి మళ్లీ వ్యక్తిగత ఖాతాలు తెరిపించాల్సిన పరిస్థితి నెలకొనడంతో గంటల తరబడి బారులు తీరుతున్నారు. వేలిముద్ర నిర్ధారణ కోసం మూడు రోజుల నుంచి తిరుగుతుండగా, బ్యాంక్ సర్వర్ సరిగా రావడం లేదంటూ సిబ్బంది చెబుతుండడంతో పింఛన్దారులు ఎండలోనే ఇంటిబాట పడుతున్నారు. చేయూత పింఛన్ పెంచి ఇవ్వకపోగా, ఇచ్చేది కూడా ఇలా కొర్రీలతో కాలం వెల్లదీస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు.