Karimnagar | కొత్తపల్లి, సెప్టెంబర్ 1: మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించిన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ఆర్థిక సాయం కాదని, సాంఘీక భద్రతాచర్యగా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచిందని గుర్తు చేశారు. ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఒకసారి చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వారి పదవీ కాలం ముగిసిన అనంతరం జీవిత కాలం పెన్షన్ తీసుకుంటున్నారని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే ప్రభుత్వోద్యోగులను కూడా వారితో సమానంగా చూసేలా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమేనని గుర్తు చేశారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సందర్భంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన వారిలో ఉద్యోగుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అలాంటి ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. గత కొన్నేళ్ళుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పాలకులు కనబరుస్తున్న నిర్లక్ష్యంతో ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్యం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే, రాష్ట్ర జెఎసి పిలుపుతో ఎలాంటి ఉద్యమాలు నిర్వహించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సహనం నశించి ప్రజాసేవలో వెనుకడుగేస్తే ప్రజాప్రతినిధులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఉద్యోగులు కోరేవి గొంతెమ్మ కోర్కెలు కావని, ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తూ, పెన్షన్ పునరుద్దరించాలని కోరుతుండటాన్ని కూడా పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వోద్యోగులను అవినీతిపరులుగా చిత్రించటం సముచితం కాదని, అవినీతికి పాల్పడితే వారిని పట్టుకునేందుకు ఏసిబి విధులు నిర్వహిస్తుందని, వారిని పట్టుకుని ఎలాంటి శిక్ష విధించినా ఉద్యోగ సంఘాలు అడురావని అన్నారు. అలాగే. అటెండెన్స్ అంశంలో బయోమె టిక్. పేస్ రికగెజేషన్ పద్ధతులు అవలంభిస్తూ ఉద్యోగులను అవమానపర్చటం సముచితమేనా అని ప్రశ్నించారు.
పనిగంటలతో సంబంధం లేకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నా, ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితులు, జ్వరాల సీజన్లో జంకు గొంకు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తున్నా గడియారంతో పోల్చటం వారి ఉద్యోగ జీవితానికే అత్యంత అవమానకరంగా భావిస్తున్నామన్నారు. అంతకుముందు టీ ఎన్ జీవోల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌రావు, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రఘుశంకర్‌రెడ్డి, రవీంద్రాచారి, కరుణాకర్‌రెడ్డి, టీఎన్జీవోల సంఘం నాయకులు నాగుల నర్సింహాస్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, హర్శిందర్ సింగ్, ఇరుమల్ల శారద, సబిత, రవీందర్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజేశేభరద్వాజ్, చంద్రశేఖర్, గోవిందపతి శ్రీనివాస్, అజరుద్దీన్, రమేశ్ గౌడ్, వెలిచాల సుమంల్రావు, కరుణాకర్, లవకుమార్, బౌరి శ్రీనివాస్, రాజేశ్వరరావు, కమలాకర్, రాజేందర్‌రాజు, కోట రామస్వామి, శంకర్, శ్రీనివాస్, హరిప్రియ, శైలజ, శారద, టీటీయూ నాయకులు ఆదర్శంరెడ్డి, గంప చంద్రశేఖర్, ఈశ్వరయ్య, రామ్మోహన్, రోహిత్‌కుమార్‌తో పాటు 200 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.