కొత్తపల్లి, అక్టోబర్ 7 : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ప్రభుత్వోద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో దసరాలోగా కనీసం మూడింటినైనా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే వారిని చర్చలకు పిలువాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో సోమవారం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులను ఈ-కుభేర్తో కాకుండా జిల్లా ట్రెజరీల అందేలా చూడాలని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ సీమ్‌ను వెంటనే ప్రకటించాలని కోరారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని, వారి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లీవ్ సాలరీ, జీపీఎఫ్ లోన్లు, మెడికల్ బిల్లులు, లీవ్ ఇన్ క్యాష్ అసెస్మెంట్, బిల్డింగ్ లోన్లను వెంటనే చెల్లించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు బడ్జెట్ లేక, పెట్టిన బిల్లులు రాక అధికారుల ఒత్తిడితో తమ సొంత పైసలతో పనులు చేస్తున్నారని, వారికి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దసరా, సద్దుల బతుకమ్మ సంబురాలకు పంచాయతీ కార్యదర్శులకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, నాయకులు ముప్పిడి కిరణ్‌కుమార్, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, ఒంటెల రవీందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, గంగారపు రమేశ్, సర్దార్ హర్మీందర్‌సింగ్, రాజేశ్ భరద్వాజ్, సబిత, విజయలక్ష్మి, ముల రాజేశ్వరరావు, కోట రామస్వామి, పలు డిపార్ట్మెంట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.