Pending bills | గంగాధర, జూన్ 1 : సర్పంచులుగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ మల్ల మేఘరాజు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి హైదరాబాద్ బయలుదేరిన మేఘరాజును గంగాధర మండలం వెంకటాయపల్లిలో పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం మాజీ సర్పంచులను అక్రమ అరెస్టు చేయడం అన్యాయం అని భయపడ్డారు.
సర్పంచులుగా అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినట్లు, సంఘ భవనాలు కట్టించినట్లు తెలిపారు. మన ఊరు-మన బడికి సంబంధించిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్డీఎఫ్, సీడీఎఫ్, డీఎంఎఫ్టీ బిల్లుల కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర నిధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రాకపోవడంతో కార్తిక ఇబ్బందులతో మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. మరి కొంతమంది మాజీ అప్పుల పాలై, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.