Dharmaram | ధర్మారం, నవంబర్26: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారులు, భక్తుల కోలాహలం మధ్య ఈ ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దాగేటి ఉదయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం యాదవులు డీజే సౌండ్స్ తో మల్లన్న గీతాలతో శోభాయాత్ర నిర్వహించి పసుపు బండారి, బంతిపూలతో ఊరేగింపుగా మల్లన్న గుట్ట పైకి వెళ్లారు.
అనంతరం మల్లన్న దేవుడి గుడి ముందు ఉన్న మండపం లో ఒగ్గుడోలు కళాకారులు పట్టుపరిచి పట్నం వేసి మల్లన్న దేవుడి జీవిత చరిత్ర గురించి కథ చెప్పారు. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం గుట్టపైనే ప్రత్యేకంగా నైవేద్యం వండి మల్లన్న దేవుడికి సమర్పించారు. దీంతో ఇక్కడ షష్టి ( దండి వారాలు) ప్రారంభమైనాయి. గుట్టపై ప్రతి బుధవారం, ఆదివారం మల్లన్న దేవుడి తీర్థాలు ( పట్నాలు) జరుగుతాయని ఇట్టి ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కాగా ఇక్కడ పెద్దపట్నం అనంతరం భక్తులు మల్లన్న దేవుడికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు.
కాగా తొలి రోజు పెద్దపట్నం ఉత్సవం పురస్కరించుకొని స్థానికుడు పూస్కురు పవన్ రావు సహకారంతో భక్తులకు ఆలయ కమిటీ, యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పర్వతాల మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అరుకుటి మల్లేశం, కోశాధికారి దాగేటి కొమురయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు ఈరవేణి శ్రీనివాస్, ఆవుల రాజేశం, సులిగే శేఖర్, యాదవ సంఘం పెద్దలు దాగేటి శంకరయ్య, దాగేటి కొమురయ్య, తుమ్మల కొమురయ్య, తుమ్మల రాజేశం తదితరులు పాల్గొన్నారు.