కోల్ సిటీ, సెప్టెంబర్ 4: ఒకప్పుడు తను పడిన కష్టాలు మరెవ్వరు పడొద్దని భావించి..వరద బాధితులు పడుతున్న కష్టాలను చూసి చలించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన యూట్యూబ్ నటీ, డైరెక్టర్ కాటం విజయ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా గంగాస్థాన్ తో పాటు పలు ప్రాంతాలలో వరద సృష్టించిన విలయంకు సర్వం నష్టపోయి అనేక కుటుంబాలు నిరాశ్రయులు కావడం, అన్నపానీయాలు లేక కూడు, గూడు చెదిరి అల్లాడుతుండటంను చూసి చలించిన షార్ట్ ఫిలిం నటి విజయ తన స్నేహబంధం గ్రూప్ మిత్రుల సహకారం తీసుకొని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు.
అక్కడ నిరాశ్రయులైన బాధితులను నేరుగా కలుసుకొని వారి సాదక బాధలను అడిగి తెలుసుకున్నారు.
అప్పటికప్పుడు అనేక మంది బాధితులకు దుప్పట్లను అందజేసి ఉదారతను చాటుకున్నారు. బాధిత మహిళలకు తోచినంత సాయం అందించారు. ఇంకా తోడ్పాటు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను సైతం ఒకప్పుడు తెగిన గాలిపటం వలె నా అనేవారు ఉన్నా ఏ బంధాలకు నోచుకోలేక ఒంటరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానని, అలాంటి కష్టాలను స్వయంగా అనుభవించినందునే ఈ వరద బాధితుల దయనీయ స్థితి చూసి హృదయం తరుక్కుపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిత్ర బృందం ప్రేమ్ కుమార్, పంజాల వెంకన్న గౌడ్, తిరుపతి, సుధాకర్ రెడ్డి, శంకర్ నాయక్, ఆనంద్, నరేశ్, గుండుబాస్, వెంకటేష్, చింటు తదితరులు పాల్గొన్నారు.