పెద్దపల్లి, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సోమవారం ప్రజావాణి సాగుతుండగా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టం పేటకు చెందిన సతీష్ అనే యువకుడు వచ్చి తన తండ్రికి సంబంధించిన ఉద్యోగం ఇస్తానని చెప్పి..ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సమక్షంలో పురుగుల మందు సేవించేందుకు యత్నించాడు.
గమనించిన కలెక్టరేట్ సిబ్బంది సదరు యువకుడిని వారించారు. బాధితుడి తండ్రి కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో పాము కాటుకు గురైన చనిపోయారు. దీంతో తన తండ్రి ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడిని కలెక్టర్ సిబ్బంది 108కు సమాచారం అందించి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.