కోల్సిటీ, జనవరి 13: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త యాదవ రాజుకు వివేకానంద యువశక్తి అవార్డు లభించింది. గత 35 యేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను స్వయంగా సందర్శిస్తూ యువతలో దేశభక్తి, శాంతి సామరస్యత, జాతీయ సమైక్యతకు కృషి చేయడమే కాకుండా గత ఏడాది 153 రక్తదాన శిబిరాలు నిర్వహించి తాను 83 సార్లు రక్తదానం చేసి బుక్ ఆఫ్ వరల్డ్ లండన్ సర్టిఫికెట్ ను కైవసం చేసుకున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అతని సేవలను గుర్తించి రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
గోదావరిఖని మార్కండేయ కాలనీలో జరిగిన ఒక కార్యక్రమంలో యాదవ రాజును ఈ అవార్డుతో ఘనంగా సత్కరించింది. శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. మహాత్మాగాంధీ, భగత్ సింగ్, రాజ్గురూ, అంబేద్కర్, జ్యోతిరావు పూలె లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత సేవకు తన జీవితం ను అంకితం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ మధ్యనే హర్యాన రాష్ట్రంలో జాతీయ కర్మయోగ అవార్డును ఆ రాష్ట్ర విధాన సభ స్పీకర్ చేతుల మీదుగా అందుకున్నాడు. దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా యాదవ రాజు అక్కడకు వెళ్లి తన వంతు సేవలు అందిస్తుంటాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు అమరేందర్ రావు, మంతెన శ్రీనివాస్, నిట్టూరి జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు.