sucide | ఓదెల, ఏప్రిల్20 : కూతుర్లకు పెళ్లి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఓదెల మండలం పోత్కపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పోత్కపల్లి గ్రామానికి చెందిన సుధగోని తిరుపతి గౌడ్(50) అనే వ్యక్తి కూతుర్ల పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక శనివారం అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్ రైల్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతి గౌడ్‌కు ఇద్దరు కూతుర్లు, కాగా వారికి వివాహం చేశాడు.
గ్రామంలో గీత కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తూ ఉండేవాడు. దీంతో అప్పులు తీర్చలేనని ఏడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అయినా అప్పులు తీర్చలేని పరిస్థితి ఉండడంతో తీవ్ర మనోవేదనకు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పేర్కొన్నారు. కూతుర్ల పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక తండ్రి తనువు చాలించడం గ్రామస్తులను తీవ్రంగా కలిసి వేసింది. మృతుడి భార్య రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.