Ram Charan | గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -ఉపాసన కొణిదెల దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కావడంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చారు.. వారిలో ఒకరు మగబిడ్డ కాగా, మరొకరు ఆడబిడ్డ కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు రెట్టింపయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారసుడి రాకతో చిరంజీవి కుటుంబం మాత్రమే కాదు, అభిమానులు కూడా ఉత్సాహంలో మునిగిపోయారు. ఈ శుభవార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.
మెగా ఫ్యామిలీలో మూడో తరానికి వస్తే ఎక్కువగా ఆడపిల్లలే పుట్టడం గమనించదగ్గ విషయం. ఇటీవల వరుణ్ తేజ్‌కు మగబిడ్డ పుట్టినా, చిరంజీవి ఇంట్లో మాత్రం ఇప్పటివరకు ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు. ఒక మగబిడ్డ పుడితే బాగుంటుందని చిరంజీవి పలు సందర్భాల్లో తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో కొంత విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా రామ్ చరణ్ “అన్‌స్టాపబుల్” షోకు హాజరైనప్పుడు ఆయన తల్లి పంపిన వీడియో సందేశంలో కూడా ఇదే కోరిక వెల్లడైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరడంతో మెగా కుటుంబం ఆనందంలో తేలిపోతోంది.
ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రిగా మారిన రామ్ చరణ్ జీవితంలో ఇది మరో మధుర ఘట్టం. ఈ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది పిల్లల పేర్ల విషయమే. మెగా కుటుంబంలో సాధారణంగా పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేర్లకు సంబంధించిన సెంటిమెంట్స్ కనిపిస్తుంటాయి. అయితే రామ్ చరణ్ తన మొదటి కూతురికి మాత్రం భిన్నంగా ‘క్లీంకారా’ అనే పేరు పెట్టడం విశేషం. ఈ పేరు లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు అప్పట్లో చిరంజీవి స్వయంగా వెల్లడించారు.ఇప్పుడు కవలల విషయంలో కూడా ఆధ్యాత్మిక అర్థం ఉన్న పేర్లనే ఎంచుకుంటారా? లేక సంప్రదాయ సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మగబిడ్డకు ఎవరు పేరు పెడతారు అన్న అంశంపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది.