Manthani | మంథని, ఏప్రిల్ 13: ఆదివారం ఉదయం కొద్దిసేపు కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసిన రైతులు వర్షం పడుతుండడంతో ఆందోళన చెందారు. మంథని మున్సిపల్ పరిధిలోని ఏఎంసీ, అంగుళూరు, గంగపురి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం కొంతమేర తడిసింది.
అదేవిధంగా మండలంలోని ఎగ్లాస్పూర్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కూడా కొంతమేర తడిసినట్లు రైతులు వాపోతున్నారు. చిరుజల్లులతో వర్షం కురియడం ప్రారంభం కావడంతో అప్రమత్తమైన రైతులు ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఎప్పుడు వర్షం పడుతుందోననే భయంతో తాము బిక్కు బిక్కు మంటూ ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.