గోదావరిఖని : సింగరేణి సంస్థకు గుండెకాయగా చెప్పుకునే అన్వేషణ విభాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి విభాగాన్ని మూసివేసిన సింగరేణి యాజమాన్యం రామగుండం విభాగంలో పనిచేసే కార్మికులకు పనులు లేవనే సాకుతో పర్మినెంట్ కార్మికులను ఇతర విభాగాలకు బదిలీలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి మొత్తం అన్వేషణ విభాగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు సింగరేణి యాజమాన్యం వేగంగా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతం రామగుండం విభాగం కిందనే భూపాలపల్లి ఏరియా కు సంబంధించిన అన్వేషణ విభాగం పనులు సాగుతున్నాయి. మొత్తంగా 150 మంది పర్మినెంట్ కార్మికులు మరో వందమంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసే ఈ విభాగంలో పనులు లేవని సాకుగా చూపుతున్నట్లుగా తెలుస్తుంది. సంస్థ మనుగడ కోసం ఏమాత్రం ఆరాటం లేని అధికారుల మొండివైఖరి విడినాడి అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సంస్థ భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఈ సంస్థపై ఆధారపడి జీవిస్తున్న వారికి పనులు కల్పించే విధంగా అధికారులు ముందుకు సాగాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాలలో ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.