గోదావరిఖని : సింగరేణి(Singareni) సంస్థలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న రెండు నెలలకు గాను నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి(Increase coal production) కార్మికులకు యజమాన్యం ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది. 1 ఫిబ్రవరి నుంచి మార్చి 31 వరకు ప్రోత్సాహక బహుమతులు కార్మికులకు నగదు రూపేనా అందజేయనున్నట్లు యజమాన్యం స్పష్టం చేసింది. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, సిహెచ్ పిలలో పనిచేసే కార్మికులకు నగదు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి గాను రెండు నెలల్లో 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉంది.
ఈ ఉత్పత్తి సాధించడానికి కార్మికులకు నగదు రూపేనా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు యజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా జనవరి 31 నాటికి 53.73 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలలో భారీగా బొగ్గు ఉత్పత్తి జరిగితేనే నిర్దేశిత లక్ష్యాలు సాధ్యమవుతాయి. దీనికి గాను యజమాన్యం రెండు విధాలుగా నగదు ప్రోత్సాహకాలను చెల్లించనుంది.
మొదటి విధానంలో ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి. రెండో విధానంలో లక్ష్యాన్ని అధిగమించడం చేస్తే ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది. 100 నుంచి 104% బొగ్గు ఉత్పత్తి సాధిస్తే ప్రతి కార్మికుడికి 1500 రూపాయలు 105% నుంచి 109% సాధిస్తే 2000 రూపాయలు 110 అంతకన్నా ఎక్కువ బొగ్గు ఉత్పత్తి సాధిస్తే 2500 రూపాయలు నగదు ప్రోత్సాహకంగా చెల్లించనున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులు అధికంగా శ్రమించి అధిక బొగ్గు ఉత్పత్తి కోసం కృషి చేయాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నది.