Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం అని తెలిపారు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం అని వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం అని అన్నారు.
“మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి” అని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ అని కొనియాడారు.
“నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.” అని తెలిపారు. ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం అని అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.