పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల ప్రశాంత్ అన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8,50,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమలు కాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి విద్యార్థుల బకాయి ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్లేందుకు ఫీజులు చెల్లించలేక పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఇక్కడ విద్యార్థులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.