మంథని, ఫిబ్రవరి 19: ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో(SRSP canal) ప్రమాదవశాత్తు పడి సింగరేణి రిటైర్డు కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం చోటు చేసుకుంది. మంథని ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన తిప్పని శంకరయ్య(80) అనే వృద్ధుడు సింగరేణిలో కార్మికుడిగా పని చేసి రిటైర్డు అయ్యాడు. ఈ నెల 5వ తేదీన సొంత గ్రామమైన ఓదెలకు వెళ్తానని అతని భార్య మల్లమ్మకి చెప్పి వెళ్లిన అతనకు ఓదెలకు చేరుకోలేదు. దీంతో ఈ నెల 6వ తేదీన శంకరయ్య కుమారుడు తిప్పని లక్ష్మణ్ తన తండ్రి కన్పించడం లేదంటూ శ్రీరాంపూర్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బుధవారం ఉదయం పోచమ్మవాడలోని గురుకుల పాఠశాల వెనుకాల ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రీరాంపూర్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా శంకరయ్య బంధువులు మంథనికి పిలిపించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి శంకరయ్యగా గుర్తించారు. శంకరయ్య మద్యం సేవిస్తే మతిస్థితిమితం లేకుండా తిరుగుతాడని ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు కెనాల్లో పడి మృతి చెందినట్లు మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.