సుల్తానాబాద్ రూరల్, జూలై 18: ప్రభుత్వ ఉద్యోగంపై వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగరీత్యా అంచలంచలుగా ఎదిగి ఐపీఎస్‌గా (IPS) పదవీ విరమణ పొందినా సొంత గ్రామంపై మక్కువతోనే తన వంతు సహాయ సహకారాలను అందించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు చేయూతని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sulthanabad) మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి ఎస్ఐ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగారు. రెండేండ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి గ్రామానికి తన వంతు చేతను అందించాలని ఉద్దేశంతో ఉండేవారు. గ్రామ దేవతలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆయన తనవంతుగా మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి విగ్రహాలను రూ.లక్షతో పాటు గ్రానైట్‌ను కూడా రూ.50 వేయిలతో ఏర్పాటు చేయించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో హనుమాన్ ఆలయానికి, నవగ్రహాలకు, కల్యాణమండపం, ధ్వజ స్తంభానికి రూ.2 లక్షలతో గ్రానైట్ వేయించడంతోపాటు రూ.60 వేలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి రంగులను వేయించారు.
ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం రూ.1లక్ష 50 వేలు వితరణ చేశారు. పోచమ్మ గుడికి పోతరాజు విగ్రహం కోసం రూ.10 వేలతో కొనుగోలు చేసి ఇచ్చారు. మడేలయ ఆలయ నిర్మాణం కోసం రూ.50 వేలను ఇచ్చారు. సీతారామ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు రూ.1లక్ష 50 వేయిలను ఖర్చు చేశారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎవరు లేకపోతే మహిళలు బతుకమ్మ ఆటపాటల కోసం రూ.1 లక్షతో ఏర్పాట్లను చేశారు. 60 మంది విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు ఇప్పించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా కృషి చేశారు. ఎస్సీలకు టెంట్ హౌస్, సౌండ్ బాక్స్‌లను రూ.50 వేలతో కొనుగోలు చేసి వితరణ చేశారు. దాదాపుగా రూ.10 లక్షల వరకు గ్రామానికి చేయూతను అందించారు. ఇంకా గ్రామానికి మంచి జరిగే కార్యక్రమాలను తన వంతుగా సహాయ సహకారాలను అందించాలని సంకల్పంతో ఉన్నారు. గత 7 ఏళ్ల నుంచి జీతంలో నుంచి కొంత, రైతుబంధుతోపాటు పంట నుంచి వచ్చే డబ్బులను గ్రామానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగరీత్యా కూడా పలువురికి సాయ సహకారాలను అందించినట్లు సమాచారం.
ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ అందరితో కలిసి పోతారు. గ్రామానికి వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడుతారని మంచిరామికి చెందిన నగునూరి వెంకట లక్ష్మణ్ అన్నారు. గ్రామం నుంచి వెళ్లిన వాళ్ల అవసరాలను తెలుసుకొని తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంటాడు. ఆలయాలు, దైవ కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ వయిస్తాడు. గ్రామానికి తన వంతు చేతను అందిస్తున్నాడు. ఉద్యోగంలో ఉన్న లేకపోయినా అలాగే సహాయ సహకారాలను అందించడం సంతోషంగా ఉంది.