కోల్ సిటీ, ఫిబ్రవరి 24: రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో డీజిల్, వాహనాల కొనుగోలు పలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం వరంగల్ రీజినల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ విచారణ చేపట్టారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ ఛాంబర్లో ఆయన సంబంధిత విభాగాల అధికారులను విచారించారు. గతంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో ఆ వాహనాలు కార్యాలయానికి రాకముందుకే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారు. అలాగే పారిశుద్ధ్య విభాగంలోని వాహనాల్లో డీజిల్ తక్కువ పోస్తూ ఎక్కువ బిల్లులు రాస్తూ పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రికార్డులను పరిశీలించారు.
సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొన్ని రికార్డులను సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డిజిల్ అవకతవకలపై కూడా మందలించినట్లు సమాచారం. విచారణ అనంతరం నివేదికలను సిడిఎంఎకు సమర్పించనున్నట్లు ఆర్డీ తెలిపారు. ఆ తర్వాత విజిలెన్స్ విచారణలో తుది చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం రీజనల్ డైరెక్టర్ చేపట్టిన విచారణతో సంబంధిత విభాగాల అధికారులు ఆందోళన కనిపించింది.