పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 18: ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని మేధావులంతా అంటుంటారు, ఆచరిస్తుంటారు. సామాన్యుడికి ఓటు వజ్రాయుదం అన్నట్లు.. ఓటుతోనే ఏదైనా సాధించవచ్చని అన్నట్లు.. తలరాతలనే తారుమారు చేసేలా మారింది ఓటు. పెద్దపల్లి మండలం రంగాపూర్ సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) సందర్భంగా అదే ఆవిష్కృతమైంది. వివరాల్లోకి వెళితే మూడో విడుత ఎన్నికల సందర్భంగా రంగాపూర్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థులుగా గంట రమేష్, కలబోయిన నరేందర్, ఈర్ల భువన్ తేజ్ పోటీ చేశారు. అయితే ఈ నెల 5న నామినేషన్లతో ప్రారంభమైన ఎన్నికల తంతు బుధవారం జరిగిన ఎన్నికలతో ముగిసింది.
ఇక్కడ ఒకే పార్టీలో ఒకే నాయకునికింద ప్రధాన అనుచరులుగా చలామణి అయినవారు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి ఎన్నికల్లో తలపడ్డారు. అయితే హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారంతో టగ్ ఆఫ్ వార్ లా కొనసాగింది ఎన్నికల యుద్ధం. ఈ క్రమంలో ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీలోనే పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావుకు ప్రదాన అనుచరులుగా ఉన్న ఇద్దరు నాయకులు ఆ గ్రామానికి మాజీ ప్రజాప్రతినిధులే కావడం విశేషం. అందులో ఒకరు గంట రమేష్ కాగా మరొకరు కలబోయిన మహేందర్ తమ్ముడు నరేందర్. వీరిద్దరు కూడా అదే గ్రామానికి ఒకే పార్టీ నుంచి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలో దిగారు, గత వారం రోజులుగా హోరాహోరీ జరిగిన ప్రచారంలో పోలింగ్ జరిగింది.
గంట రమేష్ బ్యాట్ గుర్తుకు 886 ఓట్లు , ప్రత్యర్థి కలబోయిన నరేందర్‌కు 884ఓట్లు వచ్చాయి. అలాగే మరో అభ్యర్థి ఈర్ల భువనతేజకు 5 ఓట్లు పోలవగా, ఒక ఓటు నోటాకు పడింది. పోలైన ఓట్లలో 15ఓట్లు చెల్లకుండా పోయాయి. కెవలం రెండు ఓట్లతో గంట రమేష్ గెలువడం ఇరువర్గాలను ఆందోళనకు గురి చేసింది. పోలైన 15 ఓట్లు చెల్లనివిగాపోవడంతో అవి మాకు సంబంధించినవే అయి ఉండవచ్చని బావించిన ప్రత్యర్థి వర్గంతో పాటు అభ్యర్థి కూడా రీకౌంటింగ్ చేయాలనిపట్టు బట్టడడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలైన ఓట్లకు రీ కౌంటింగ్ జరిపారు. రీ కౌంటింగ్ అనంతరం గంట రమేష్‌కు ఒక ఓటు తగ్గి 885, కలబోయిన నరేందర్‌కు 884 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత ఒక ఓటు తగ్గిపోయి ఒకే ఒక్క ఓటుతో గంట రమేష్ తన సమీప ప్రత్యర్థి కలబోయిన నరేందర్‌పై విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఒక్క ఓటు ఇద్దరు అభ్యర్థులకు, వారి అనుచరగణానికీ గంటపాటు చెమటలు కక్కించింది.