పెద్దపల్లి : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్ పల్లి మానేరు వాగు, చెక్ డ్యామ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల కోసం ఆలోచించారని, అందుకు నిదర్శనమే ఈ మానేరు వాగు చెక్ డ్యామ్ నిర్మాణం అన్నారు. మానేరు వాగుపై చెక్ డ్యామ్ కడితే ఇది సైంటిఫిక్ గా లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి మానేరువాగును చూడాలన్నారు.
ఇక్కడ మత్స్యకారులు చేపలు ఎలా పడుతున్నారు? జీవనోపాధి ఎలా కలుగుతుందో చూడాలన్నారు. తప్పుడు ప్రకటన చేసిన ఎమ్మెల్యే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫిల్లర్ కుంగిపోతే మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోవడంలేదని దానివల్ల ఎంతోమంది మత్స్యకారులు, రైతులు నష్టపోతున్నారని పుట్ట మధు అన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులు, మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.